నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్26(నమస్తే తెలంగాణ): కేసీఆర్ నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న టీఆర్ఎస్ నాలుగేండ్ల కిందట బీఆర్ఎస్గా రూపాంతరం చెంది నేటికీ 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగిడుతున్న వేళ ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలకు పార్టీ సిద్ధమైంది. గతేడాది ఘనంగా రజతోత్సవ వేడుకలు జరుపుకున్న పార్టీ శ్రేణులు సోమవారం ఆవిర్భావ దినోత్సవ సంబురాలను వాడవాడలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా అంతటా గ్రామ గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు.
ఉదయం జెండా ఎగురవేసిన అనంతరం మధ్యా హ్నం 1.30గంటలకు తెలంగాణ భవన్లో జరుగనున్న పార్టీ రాష్ట్ర ప్లీనరీకి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్తు, కార్పోరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తరలివెళ్లనున్నారు. 26 ఏండ్ల ప్రస్థానంలో 13ఏండ్లు ఉద్యమ పార్టీగా ఆ తర్వాత 10 ఏండ్లు పాలక పార్టీగా ఎన్నో చారిత్రక ఘట్టాలకు, అభివృద్ధి నమూనాకు వేదికగా నిలిచింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ఉద్యమకాలంలో నినాదాలుగా ఉన్న ఎన్నో సమస్యలకు అధికార పార్టీగా ఒక్కొక్కటిగా పరిష్కారం చూపుతూ ప్రజల మనస్సులను గెలుచుకుంది.
అభివృద్ధి, సంక్షేమం అనే పదాలకే కొత్త భాష్యం చెబుతూ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. పార్టీ ఏండ్ల ప్రస్థానంలో ఉమ్మ డి నల్లగొండ జిల్లా కీలకపాత్ర పోషిస్తూనే వస్తోంది. ప్రస్తుతం అధికారం లేకపోయినా పార్టీ పరంగా ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది సభ్యులతో సంస్థాగతంగానూ పటిష్టమైన పార్టీగా ఉమ్మడి జిల్లాలోని ప్రతీ ఆవాసాప్రాంతానికి, మారుమూల తండాకు, ప్రతీ బస్తీ, గల్లీకి సైతం గులాబీ జెండా విస్తరించింది. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానంతో బోణీ కొట్టిన పార్టీ 2018 ఎన్నికల్లోనూ 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపొంది చరిత్ర సృష్టించింది.
ఇక తర్వాత ఒక్కొక్కటిగా జరుగుతూ వచ్చిన మూడు ఉప ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన హుజూర్నగర్, మునుగోడుతో పాటు నాగార్జునసాగర్‌లోనూ విజయ ఢంకా మోగించిం ది. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న మొదటి పార్టీగా బీఆర్ఎస్ ఎవ్వరికీ సాధ్యం కానీ విజయాల రికార్డును సొంత చేసుకుంది. ఆనాడు టీఆర్ఎస్కు తొలి విజయం సిద్దిపేట అందిస్తే… బీఆర్ఎస్గా ఏర్పడ్డాక 2022 చివర్లో మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బోణీ అం దించింది నల్లగొండ జిల్లానే. తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త పరిణామాల్లో భాగంగా అధికారం కోల్పోయినా జిల్లాల్లో ఒక్క స్థానానికే పరిమితమైనా పడిలేచిన కెరటంలా బీఆర్ఎస్ పుంజుకుంటున్నది.
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిరంతరం ప్రభుత్వంపై రాజీలేని పోరాటాల్లో నిమగ్నమైంది. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం ఉద్యమిస్తూనే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో అన్నిచోట్ల గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంపై జనం లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతతో భవిష్య త్తు తిరిగి బీఆర్ఎస్‌దేనన్న దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోదావరి, కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయాల నుంచి మొదలు పెడితే ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలిచింది. రెండేళ్లలోనే అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రానున్న కాలంలో కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్దే విజయమన్న ప్రగాఢమైన విశ్వాసంతో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో సోమవారం ఉమ్మడి జిల్లా అంతటా పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.
పార్టీ జెండాల ఆవిష్కరణ..
బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా అం తటా పార్టీ జెండాలను ఎగురవేయనున్నారు. కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో పార్టీ జెం డాను ఎగురవేసి సంబురంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో ముగినిపోయారు. గ్రామా ల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో జెండా పం డుగ నిర్వహించనున్నారు. మూడు జిల్లాల పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ జెండా ఎగురవేయనున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే ఆవిర్భావ వేడుకల్లోనూ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలంతా భాగస్వాము లు కావాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.