సూర్యాపేట జిల్లాకు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 కళాశాలలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా అందులో సూర్యాపేట కూడా ఉన్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు గతంలో ప్రతిపాదనలు పంపగా ఈ కళాశాల మంజూరైంది. 2014కు ముందు సూర్యాపేట జిల్లాలో 6 గురుకులాలు ఉండగా నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు కలిపి 22కి చేరింది.
– సూర్యాపేట, జూన్ 23 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లాకు మహాత్మాజ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలకు 17 కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేయగా అందులో సూర్యాపేట కూడా ఉన్నది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు జరుగనున్నాయి. 2014కు ముందు సూర్యాపేటలో కేవలం 6 గురుకులాలు మాత్రమే ఉండగా నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నీ కలిపి గురుకులాల సంఖ్య 22కు చేరుకుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో 2 గురుకుల పాఠశాలలు, 4 కళాశాలలు ఉన్నాయి. తదనంతరం 19 పాఠశాలలు మంజూరుతో పాఠశాలల సంఖ్య 21కి చేరుకోగా వీటిలో 19 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. ఇక జిల్లాకు రెండు గురుకుల డిగ్రీ కళాశాలలు మంజూరు చేయగా తాజాగా మరో బీసీ డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. దీంతో మొత్తం గురుకుల డిగ్రీ కళాశాలలు 3కు చేరుకున్నాయి.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు 4 మాత్రమే ఉండగా 2016-17లో కొత్తగా 4 పాఠశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. తదనంతరం 4 పాఠశాలలను ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల విషయానికి వస్తే రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 పాఠశాలలు ఉండగా తదనంతరం 2 పాఠశాలలు, 1 డిగ్రీ కళాశాల మంజూరు అయ్యాయి. వీటిలో 3 పాఠశాలలను కళాశాలలు అప్‌గ్రేడ్ అయ్యాయి. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాల విషయానికి వస్తే 2017-22 వరకు జిల్లాకు 9 పాఠశాలలు మంజూరు కాగా వీటిలో 8 పాఠశాలలు కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా జిల్లాలో 2016-17 విద్యా సంవత్సరంలో 4 మైనారిటీ గురుకుల పాఠశాలలను మంజూరు చేయగా 2019-20 విద్యా సంవత్సరంలో 4 ఇంటర్మీడియట్ కళాశాలలుగా ఉన్నతీకరించబడినవి. తాజాగా ప్రభుత్వం జిల్లాకు మహాత్మాజ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలను మంజూరు చేయగా ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు జరుగనున్న నేపధ్యంలో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.