యాదాద్రి భువనగిరి, జూలై 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అన్నదాత అరిగోస పడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం అన్నదాత పథకాలను సైతం సరిగ్గా అమలు చేయడం లేదు. ఇందుకు ఉదాహరణే రైతు బీమా. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచే రైతు బీమా పథకం అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. ఇంటి యజమాని మరణించి నెలలు గడుస్తున్నా రూ.5 లక్షల సాయం పత్తాలేకుండా పోయింది. డబ్బులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా లాభం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులో జాప్యం చేయడంతోనే సకాలంలో పరిహారం అందడంలేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొంత కాలంగా రైతు బీమా పథకం సక్రమంగా అమలు కావడం లేదు. రైతు కుటుంబాలకు బీమా డబ్బులు సకాలంలో జమ కావడం లేదు. అన్ని దరఖాస్తులు సక్రమంగానే సమర్పించినా నెలల తరబడి పెండింగ్లో మూలుగుతున్నాయి. దరఖాస్తులకే ఇంకా మోక్షం లభించడం లేదు. 2025లో 567 మంది దరఖాస్తు చేసుకోగా 460 మందికి సెటిల్ చేశారు. ఇంకా 107 దరఖాస్తుదారులకు సాయం అందాల్సి ఉంది. అంటే సుమారు రూ.ఐదు కోట్లకు పైగా బీమా డబ్బులు జమ కావాల్సి ఉంది. మొత్తం అప్లికేషన్లలో 36 ఎల్ఐసీ, 61 ఏఈవోలతో పాటు మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ప్రీమియం సరిగా చెల్లించకపోవడంతో ఈ చిక్కులు వచ్చినట్లు తెలుస్తున్నది. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించలేదు. దీంతో పథకం అమలు నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ఏకకాంలోనే ఈ ప్రీమియాన్ని చెల్లించి ఆటంకాలు లేకుండా నడిపారు. ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వంలో రెండు దఫాలుగా ప్రీమియం చెల్లిస్తున్నారు. అదీ సమయానికి కట్టడంలేదు. దీంతో బాధితులకు పరిహారం ఇవ్వకుండా ఎల్ఐసీ పరిహారాన్ని పెండింగ్లో పెడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రీమియం చెల్లిస్తే తప్ప క్లెయిమ్లు చేయలేని దుస్థితి నెలకొంది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు, నేతన్నల సంక్షేమానికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతు మరణిస్తే వారం పది రోజుల్లోనే ఆ కుటుంబంలోని నామినీకి డబ్బులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రీమియం చెల్లించేవారు. ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. వారం పది రోజులు దేవుడెరుగు.. కొందరికి ఏడాదైనా సాయం అందక రైతు కుటుంబాలు అరిగోస పడుతున్నాయి. ఇంటి పెద్ద మరణిస్తే బక్కచిక్కిన కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందితే ఎంతో ఆసరాగా ఉండేది. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇప్పుడు మాత్రం ఎప్పుడు వస్తాయో అని ఆశగా ఎదురు చూడాల్సి పరిస్థితి నెలకొంది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలను తీసుకొచ్చారు. కుటుంబ పెద్ద మరణిస్తే… ఆ ఫ్యామిలీ రోడ్డున పడొద్దని నాటి బీఆర్ఎస్ సర్కారు రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. కుటుంబంలోని భార్యా పిల్లలకు ఆసరాగా ఉండాలని ఒక్క పైసా ఖర్చు లేకుండా పరిహారం ఇవ్వడానికి నడుం బిగించింది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. అన్నదాతపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. 18 ఏండ్ల నుంచి 59 సంవత్సరాల వయసున్న రైతులందరూ అర్హులే. పట్టాదారు పాస్ పుస్తకాలున్న ప్రతి రైతుకూ బీమా పథకం వర్తిస్తుంది. జిల్లాలో సుమారు 2.30 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు బీమా కోసం 1.36 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు.