నల్లగొండ, అక్టోబర్ 7 : దళితుల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటికే తొలి విడుతలో నియోజకవర్గానికి వంద చొప్పున జిల్లాలో 518 మందికి యూనిట్లు కేటాయించగా.. రెండో విడుత అందించేందుకు జిల్లా అధికార యంత్రాం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సారి ప్రతి నియోజకవర్గానికి 1100 మందికి ఇవ్వనుండగా, లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది. నల్లగొండ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా.. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. వారం, పది రోజుల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేసి లబ్ధిదారులకు అందజేయనున్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక నేడో రేపో పూర్తి చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తుండగా ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.35 కోట్లు విడుదల చేసింది.
ఆన్లైన్ ఆధారంగా ఈ నిధుల విడుదల జరుగనున్నది.
దళిత బంధు.. దళితుల జీవన విధానాన్ని మెరుగు పరిచి వారిలో ఆత్మగౌరవాన్ని పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందుతున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండో దశకు ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా అధికార యంత్రాంగం కలెక్టర్ల పర్యవేక్షణలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు సిద్ధం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. ఎంపిక ప్రక్రియ తుది దశలో ఉండగా వచ్చిన దరఖాస్తులను అధికారులు ఎప్పడికప్పుడే ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్ చేసిన వారి జాబితాను అనుసరించి ప్రభుత్వం నిదులు సైతం విడుదల చేస్తున్నది. జిల్లాలో రెండో విడుతలో 5,700 మందికి దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందనుండగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 1,261 మందివి ఆన్లైన్ చేశారు. దాంతో ప్రభుత్వం రూ.35 కోట్లు ఇప్పటికే విడుదల చేయగా ఆన్లైన్ ప్రక్రియ దరఖాస్తుల ఆధారంగా నిధుల విడుదల కొనసాగుతున్నది. అయితే ఈ వారంలోనే ఈ పథకం కింద ఆన్లైన్ చేసిన లబ్ధ్దిదారులకు ఆర్థిక సాయం అందనున్నది. తొలి విడుతలో నియోజక వర్గానికి వంద మంది చొప్పున జిల్లాలో 518 మందికి యూనిట్లు కేటాయించగా ఈసారి నియోజక వర్గానికి 1,100 చొప్పున మొత్తం 5,700 కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందనున్నది. అయితే ఈ వారంలోనే ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేయనుండగా ఏయే యూనిట్లు పెట్టుకుంటున్నారు.. వాటిపై ఉన్న పరిజ్ఞానం ఎంత.. వాటిని ఏ విధంగా వినియోగిస్తారు అనే కోణంలో అవగాహన కల్పించేందుకు అన్ని నియోజక వర్గాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం నల్లగొండ నియోజక వర్గానికి సంబంధించి లక్ష్మి గార్డెన్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. మిగిలిన నియోజక వర్గాల్లోనూ రెండు రోజుల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రెండో విడుతలో 5,700 కుటుంబాలకు..
రెండో దఫాగా జిల్లాలో 5,700 కుటుంబాలకు ప్రభుత్వం దళిత బంధు పథకం వర్తింపజేస్తున్నది. తొలి విడుత వంద కుటుంబాలకు ఇవ్వగా ఈసారి 11 రెట్లు పెంచి అందజేసాలా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నకిరేకల్, దేవరకొండ, మునుగోడు నియోజక వర్గాల్లో 1,100 చొప్పున మొత్తంగా 5,700 కుటుంబాలకు దళిత బంధు అందనున్నది. మునుగోడులో సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్ మండల లబ్ధ్దిదారులకు యాదాద్రి నుంచి రానుండగా తుంగతుర్తి నియోజక వర్గం నుంచి శాలిగౌరారం మండల లబ్ధిదారులకు ఇక్కడ నుంచి అందనున్నాయి. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఈసారి జిల్లాకు దళిత బందు పథకం కింద రూ.570 కోట్లు కేటాయించింది.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా..
కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ద్వారా ఎలాంటి బ్యాంక్ లింకేజీలు లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రూ.10 లక్షల్లో రూ.9.90 లక్షల ఇచ్చి మిగిలిన రూ.10 వేలకు ప్రభుత్వం మరో రూ.10 వేలు జత చేసి లబ్ధిదారు ఖాతాలోనే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉంచనున్నారు.
యూనిట్ల ఎంపికపై అవగాహన కల్పిస్తాం
ప్రభుత్వ ఆదేశానుసారం స్థానిక శాసన సభ్యుల సహకారంతో దళిత బంధు కోసం వచ్చిన దరఖాస్తుల జాబితాను ఎప్పడికప్పుడే అర్హతను తేల్చి ఆన్లైన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,261 మందివి ఆన్లైన్ చేయడంతో ప్రభుత్వం సైతం రూ.35 కోట్లు విడుదల చేసింది. ఆన్లైన్ ప్రక్రియ ఆధారంగానే నిధుల విడుదల జరుగుతున్నది. గతేడాది ప్రభుత్వం నియోజక వర్గానికి వంద కుటుంబాల చొప్పున దళిత బంధు పథకం అందచేయగా ఈసారి రెండో విడుత కింద 1,100 మందికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వారికి ఏ అంశాలపై అవగాహన ఉన్నది, ఏయే యూనిట్లు పెట్టుకోవాలనుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకుని యూనిట్లు గ్రౌండింగ్ చేసేందుకు నేడు నల్లగొండలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
– ఎల్.శ్రీనివాసులు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి, నల్లగొండ
ఈ వారం నుంచే గ్రౌండింగ్‌కు చర్యలు..
దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థానిక శాసన సభ్యుల సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతుండగా ఇప్పటివరకు ఎంపికై ఆన్లైన్ చేసిన వారికి ఈ వారం నుంచే గ్రౌండింగ్ చేసి వారికి కావాల్సిన యూనిట్లు ఇచ్చేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. నాలుగు నెలల కిందటే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఎంపిక కార్యక్రమం కొనసాగి చివరి దశకు వచ్చింది. ఈ వారంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానుండగా వెనువెంటనే యూనిట్లు కేటాయించి గ్రౌండింగ్ చేయనున్నారు.