తుంగతుర్తి, అక్టబోర్ 16 : ఎస్సారెస్పీ రెండవ దశ కాల్వకు మాజీ ఎంపీ, కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని వామపక్ష నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, కొత్తగట్టు మల్లయ్య, తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో గురువారం పద్మశాలి భవనంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కార్యక్రమంలో ఎస్సారెస్పీ స్టేజ్ 2కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు నామకరణం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోచంపాడు జలాలు ఈ ప్రాంతానికి తేవడానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎంపీగా ఉన్న కాలంలో పార్లమెంట్లో అనేకసార్లు ఈ అంశంపై పోరాటం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
తన చివరి రక్తపు బొట్టు వరకు పోచంపాడు జలాల కోసం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన భీమిరెడ్డి నరసింహారెడ్డి వారసులుగా, ఆయన అభిమానులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాటి విజయమ్మ, కోట రామస్వామి, సుందర్ రావు, ప్రభాకర్, సుదర్శన్, ఉప్పలయ్య, సైదులు, తునికి సాయిలు పాల్గొన్నారు.