అర్వపల్లి, ఏప్రిల్ 07 : వరి చివరి దశలో ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని బీఆర్ఎస్ అర్వపల్లి మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాసంగి సీజన్లో వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక అక్కడక్కడ పంటలు వదిలేయడంతో పచ్చని పంట పశువులకు మేతగా మారిందన్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో చివరి షెడ్యూల్ గా ప్రకటించి ఐదు రోజుల క్రితమే నీటిని బంద్ చేశారు. దీంతో రైతుల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మండు వేసవిలో కూడా నిరంతరం కాలువల్లో నీళ్లు ప్రవహించేవని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వల్లపు గంగయ్య, బానోతు సైదులు, నున్న యాదగిరి, యుగేందర్, హరిలాల్ పాల్గొన్నారు.