యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ప్రతిష్టంభన తొలగడం లేదు. కాలేజీ ఎల్ఓపీ (లెటర్ ఆఫ్ పర్మిషన్)పై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే రెండుసార్లు ఎల్‌ఓపీని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిరాకరించింది. దాంతో మెడికల్ కాలేజీ అధికారులు మరోసారి అప్పీల్‌కు వెళ్లారు. త్వరలోనే వర్చువల్‌గా మళ్లీ తనిఖీలు చేపట్టనున్నారు. ఈసారైనా అనుమతి వస్తుందా, లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
– యాదాద్రి భువనగిరి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు గతేడాది జూన్ 5న యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో తెలిపింది. కాలేజీ నిర్మాణానికి రూ.183 కోట్లు కేటాయించింది. 433 పోస్టులను కూడా క్రియేట్ చేస్తూ జీఓ రిలీజ్ చేసింది. ఆ తర్వాత శ్రీలక్ష్మీనరసింహస్వామి మెడికల్ కాలేజీగా నామకరణం కూడా చేశారు. మొదట వంద సీట్లతో జీఓ ఇచ్చినప్పటికీ సరైన సదుపాయాలు లేవంటూ 50 సీట్లకు కుదించారు.
పాత కలెక్టరేట్ భవనంలో మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. యాదగిరిగుట్టకు మంజూరైన కాలేజీ భువనగిరిలో ఏర్పాటు చేస్తుండటంపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పాత కలెక్టరేట్ భవనంలోనే ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మురం చేశారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రక్రియ ఉంటుంది. కాలేజీ అధికారులు అనుమతికి దరఖాస్తు చేసుకుంటే.. ఎన్ఎంసీ బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. అనుమతి ఇచ్చేందుకు వివిధ రకాల పారామీటర్లను పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మొదటిసారి ఎన్ఎంసీ బృందం స్వయంగా విచ్చేసి తనిఖీలు నిర్వహించింది.
ఆ తర్వాత అవసరమైన నిబంధనలు పాటించలేదంటూ, వసతులు లేవంటూ ఎల్వోపీని నిరాకరించింది. దాంతో మెడికల్ కాలేజీ అధికారులో అప్పీల్‌కు వెళ్లారు. అంతకంటే ముందు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాకల్టీ, స్టాఫ్ రిక్రూట్మెంట్, ఇతర సదుపాయాలను కల్పించారు. అనంతరం ఎన్ఎంసీ అధికారులు వర్చువల్‌గా తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని పలు కళాశాలలకు అనుమతి వచ్చినప్పటికీ యాదాద్రి కాలేజీకి మాత్రం రాలేదు. రెండోసారి కూడా ఎల్‌వోపీకి ఎన్ఎంసీ నిరాకరించింది.
ఎల్ఓపీ విషయంలో ఇప్పటికే రెండు సార్లు ఎన్ఎంసీ ఎల్‌ఓపీని నిరాకరించడంతో కాలేజీ అధికారులు మరోసారి అప్పీల్‌కు వెళ్లారు. కళాశాల అనుమతిని పునఃపరిశీలించాలని ఎన్ఎంసీని కోరారు. ఇటీవల అన్ని రకాల డాక్యుమెంట్లు మళ్లీ సమర్పించినట్లు సమాచారం. మరోసారి నేషనల్ మెడికల్ కమిషన్ బృందం వర్చువల్‌గా తనిఖీలు చేపట్టనుంది. ఆ తర్వాత వాళ్లు కాలేజీ సమర్పించిన అన్ని రకాల వివరాలపై సంతృప్తి చెందితే ఎల్వోపీ వచ్చే అవకాశం ఉంటుంది.
కళాశాలకు ఎల్ఓపీ రాకపోవడానికి పలు కారణాలు చెప్తున్నప్పటికీ అసలు సమస్య జిల్లా ఆస్పత్రి భవనమేనని తెలుస్తున్నది. ఆస్పత్రి భవనం అనువుగా లేదని, చిన్న స్థలంలో ఉందని, పైగా చుట్టూ ఇండ్లు ఉన్నాయనేదే ప్రధాన కారణమని సమాచారం. ఆస్పత్రిలో మూడో ఫ్లోర్ నిర్మాణానికి ఇటీవల అనుమతులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక ఫ్యాకల్టీకి వసతిగృహాలు లేవు. సరిపడా సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. త్వరలో కొత్త భవనం నిర్మాణం తర్వాత అందులోకి మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎల్ఓపీ వచ్చే రావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.