నల్లగొండ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు పగలూరాత్రి తేడా లేకుండా శరవేగంగా సాగుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతంలోని ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో 116 కోట్ల రుపాయలతో కాలేజీ భవన సముదాయ నిర్మాణం జరుగుతున్నది. పదెకరాల స్ధలంలో 4 లక్షల చదరపు మీటర్ల సామర్ధ్యంతో కళాశాల భవనంతోపాటు బాలుర, బాలికలకు వేర్వురు ప్రిన్సిపల్ క్వాటర్స్ ఏర్పాటుచేస్తున్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య 700 మంది కాగా, 900 మంది వరకు ఉండేందుకు వీలుండేలా హాస్టళ్లు సిద్ధమతున్నాయి. మెడికల్ కళాశాలలో ఆవరణలో ఆహ్లాదకర వాతావరణం కోసం 5.6 ఎకరాలతో పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మార్గదర్శకంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఉగాది నాటికి నిర్మాణం పూర్తి చేసి రానున్న విద్యాసంవత్సరంలో నూతన మెడికల్ కాలేజీ భవనంలోనే వైద్య విద్య తరగతులు ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మే22 (నమస్తే తెలంగాణ) : సీమాంధ్రుల పాలనలో కునారిల్లిన వైద్యరంగం స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజావైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలోనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు వేర్వేరుగా మెడికల్ కాలేజీలను మంజూరు చేసి సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేకతను చాటారు. మూడేండ్ల కిందటే ప్రస్తుత జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలోనే కాలేజీ తరగతులు ప్రారంభించగా శాశ్వత భవన నిర్మాణంపై దృష్టి సారించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో నిరుపేదలకు వైద్య సేవలను మరింత దగ్గరకు చేశారు. ఆస్పత్రిలో అనేక వసతులు కల్పించి ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే నానుడి నుంచి ‘సక్కంగా పోవచ్చు సర్కారు దవాఖానకు’ అనేలా రూపుదిద్దారు.
8 విభాగాలుగా భవన నిర్మాణం..
నిరుపేదల దేవాయలంగా విరాజిల్లనున్న నల్లగొండ మెడికల్ కళాశాల భవనం శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. భవనాన్ని వేగంగా నిర్మాణం చేసేందుకు ఎనమిది విభాగాలుగా విభజించి నిర్మాణ పనులు చేపట్టారు. ఐదు బ్లాకుల్లో తరగతి గదులు, లెక్చరర్స్ గ్యాలరీ, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఒక బ్లాక్‌లో అకడమిక్ అండ్ ఎగ్జామినరీ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగశాల బ్లాక్, డిపార్ట్మెంట్ బ్లాక్‌తోపాటు వైద్య విద్యార్థులకు రెస్టారెంట్ అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టారు. బాల, బాలికలకు వేర్వురుగా హాస్టల్ భవనాలు, ప్రిన్సిపాల్ క్వార్టర్స్ పేరుతో పని విభజన చేసి మెడికల్ కళాశాల భవనాన్ని శరవేగంగా నిర్మిస్తున్నారు.
Nalgonda2
900 మందికి వసతి కల్పించేలా హాస్టల్స్..
మెడికల్ కళాశాలలో మొదటి నుంచి చివరి సంవత్సరం వరకు మొత్తం 700 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారు. వీరిలో 450 మంది బాలురు, 250 మంది బాలికలు ఉంటారు. వీరిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే హాస్టల్లో వసతి కల్పించాలని వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలున్నాయి. విద్యార్థులు కాకుండా ప్రతి హాస్టల్‌కు కుకింగ్, క్లీనింగ్, సెక్యురిటీ, ధోబీ ఇతర పనులకు సంబంధించి మరో 60 మంది సిబ్బంది ఉంటారు. అయితే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని 900 మందికి కూడా వసతి కల్పించేలా విశాలమైన హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు. బాలురకు జీ+5, బాలికలకు జీ+4తో నిర్మాణాలు చేస్తున్నారు. ఇవే కాకుండా ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు ఉండేందుకు వీలుగా జీ+3 సామర్థ్యంతో, ప్రిన్సిపాల్ క్వార్టర్స్ పేర జీ+3 భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు.
పచ్చదనం కోసం గ్రీనరీ ఏర్పాటు..
కళాశాల భవనంలో ఇంటర్నల్ రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణంతోపాటు అన్ని విధాలుగా మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంది. అలాగే కళాశాల ఆవరణలో పచ్చదనం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఏకంగా 5.6 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో రకరకాల మొక్కలతో గ్రీనరీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. కాలేజీకి అవసరమైన స్థలం అందుబాటులో ఉండడంతో రాష్ట్రంలోనే మంచి మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారు.
నల్లగొండకు తలమానికం మెడికల్ కళాశాల
నల్లగొండ మెడికల్ కాలేజీ భవనం అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. కాలేజీ భవన నిర్మాణానికి సమృద్ధిగా నిధులు కేటాయించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మార్గదర్శనంలో ప్రణాళికాబద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నాణ్యతలో రాజీపడకుండా అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. కాలేజీ భవనంతోపాటు హాస్టళ్లు, క్వార్టర్స్ ఇలా ఏకకాలంలో అన్ని పనులు జరిగేలా చూస్తున్నాం. 42 ఎకరాల్లో రూ.116 కోట్లతో నిర్మాణం జరుగుతుంది. ఉగాది నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభించాలన్నదే లక్ష్యం. నల్లగొండలో ఇప్పటికే రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ నల్లగొండకు తలమానికంగా నిలువనున్నది.
-ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ
వేగంగా కళాశాల నిర్మాణ పనులు
నాణ్యతలో రాజీలేకుండా పనులు కొనసాగుతున్నాయి. ఎనిమిది బ్లాక్‌లుగా విభజించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటివరకు స్లాబ్ లెవల్స్ పూర్తయ్యి వాల్స్ మొదలుపెట్టాం. ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పర్యవేక్షణలో వారి సూచనల మేరకు నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి భవనాన్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
– అజీజ్, వైద్యారోగ్య, మౌలిక వసతుల కల్పన సంస్థ కార్యనిర్వాహక ఇంజినీర్