సూర్యాపేట, సెప్టెంబర్ 26 : రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సన్ ప్రీత్ సింగ్‌తో కలిసి కలెక్టర్ రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మీదుగా ప్రధాన జాతీయ రహదారులు వెళ్లడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదాలు జరుగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని హైవేలపై 37 బ్లాక్ స్పాట్లను, హాని జరిగే ప్రదేశాలను గుర్తించామని తెలిపారు.
జాతీయ రహదారి 65పై సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సూర్యాపేట ఆర్డీఓ ఎన్‌హెచ్ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన నివేదిక అందించాలని తెలిపారు. ఎన్‌హెచ్ 165, 365లకు సంబంధించి 5 చోట్ల బాక్ స్పాట్స్ ఉన్నాయని, వాటివద్ద లైటింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా ప్రమాద పరిష్కార బృందాలను ఏర్పాటు చేయాలని. ఇందులో ఒక పోలీస్ అధికారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఎన్హెచ్ఏఐ అధికారి, ఆర్అండ్బీ అధికారి, పంచాయతీ రాజ్ అధికారి, ఆర్టీసీ డిపో మేనేజర్, మున్సిపల్ కమిషనర్, మండల స్థాయి అధికారి ఉంటారని తెలిపారు. వారు తమ పరిధిలో రోడ్లను పరిశీలిస్తూ నివేదికలు అందించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ చేయాలని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఎన్‌హెచ్ 365బీ డిప్యూటీ మేనేజర్ రాహుల్, ఎన్‌హెచ్ 65 మేనేజర్ రాధాశ్యామ్, నాగకృష్ణ, మాధవి, ఆర్డీఓ వేణుమాధవరావు, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్, రమాదేవి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట, : ప్రభుత్వం ప్రారంభించిన మన ఇసుక వాహనం విధానం ద్వారా గృహ వినియోగ అవసరాలకు తక్కువ ధరలకు ఇసుక అందించనున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో త్వరలో ఇసుక ట్యాక్స్ విధానం అమలు చేయడానికి నిర్ణయించామన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు స్థానికులకు ఉపాధి కలిగిస్తుందని పేర్కొన్నారు. సరసమైన ధరలకు ఇసుక ఆన్లైన్ విధానంలో దొరుకుతుందని, ప్రజలు తమ గృహ అవసరాలకు రిజిస్టర్ చేయబడిన ట్రాక్టర్ల ద్వారా గుర్తించబడిన ఇసుక రీచ్ ద్వారా పొందవచ్చని తెలిపారు. జిల్లాలో తాసీల్దార్లు ఆన్లైన్లో ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.