నీలగిరి, ఆగస్టు 22 : బాధితుల ఫిర్యాదుల పట్ల జాప్యం చేయకుండా, తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేసన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధి భౌగోళిక పరిసరాలు, కేసుల నమోదు, విచారణ పురోగతి, సిబ్బంది పనితీరు, రౌడీ షీటర్స్ వివరాలను సీఐ రాజశేఖర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్హెచ్ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి, సిబ్బందికి కేటాయించిన కిట్లను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించవద్దని, సమగ్ర విచారణ చేపట్టి దోషులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు.
బ్లూ కోల్ట్, పెట్రో కార్ డ్యూటీలో ఉన్నప్పుడు 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అలాగే రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణకు స్టేషన్ పరిధిలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి, గంజాయి తాగే వారిని, వారికి సరఫరా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి, ఎస్ఐలు గోపాల్‌రావు, సైదులు, వెంకట్‌నారాయణ, సతీశ్, ఏఎస్ఐలు వెంకటయ్య, అజ్మత్, శ్రీనయ్య, వెంకన్న, సిబ్బంది అంజనేయులు, షకీల్, శ్రీకాంత్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Nalgonda : ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
Nalgonda : ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్