సమాజాన్ని పట్టిపీడిస్తూ యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ యుద్ధం ప్రకటించింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఆపరేషన్(మిషన్) పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. జిల్లా పరిధిలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే పలు చర్యలు చేపట్టగా మంచి ఫలితాలు వచ్చినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి సహకారంతోపాటు వివిధ విభాగాల భాగస్వామ్యంతో డ్రగ్స్, ఇతర నిషేధిత మత్తుపదార్ధాలను జిల్లా నుంచి తరమికొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. గురువారం ఎస్పీ పవార్ తన కార్యాలయంలో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. డ్రగ్స్ ప్రస్తుత సమాజానికి ఓ సవాల్‌గా మారుతోందని, దానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన దీనిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఎస్పీ తెలిపిన విషయాలు ఆయన మాటల్లోనే…
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు8(నమస్తే తెలంగాణ)
‘డ్రగ్ టెస్టింగ్ కిట్లను పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచాం. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ మాదిరిగానే డ్రగ్ టెస్టింగ్ కూడా సులువే. అందువల్ల కిట్స్ ద్వారా ఇప్పటికే అనుమానం ఉన్న వ్యక్తులను పరీక్షిస్తున్నాం. ఈ విషయంలో మునుగోడు, మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అలవాటు ఉన్న వారిని పీఎస్‌ల వారీగా ముందుగా గుర్తించాం. వారికి టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది. మునుగోడులో ఇలా 30 మందిని, మిర్యాలగూడలో 30 మందిని పరీక్షించాం. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చాం. భవిష్యత్‌లో డ్రగ్స్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం.
వారందరినీ కొద్దిరోజుల తర్వాత మళ్లీ పరీక్షించాం. మునుగోడులో అందరికీ నెగెటివ్ రాగా, మిర్యాలగూడలో మాత్రం ఇద్దరు మళ్లీ డ్రగ్స్ వాడినట్లు తేలింది. వారిద్దరిపై కేసు పెట్టి జైలుకు పంపించాం. ఈ శనివారం కనగల్, కట్టంగూర్ పీఎస్‌ల పరిధిలో గంజాయి వినియోగిస్తున్నట్లు అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించనున్నాం. వారికి కూడా తొలి దశలో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. కొంత సమయం ఇచ్చి మళ్లీ పరీక్షలు చేస్తాం. ఇలా అన్ని పోలీస్ స్టేషన్లలో దశల వారీగా ఆరు నెలల్లో డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం.
మరోవైపు గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇతర ప్రాంతాల్లో నుంచి జిల్లాలోకి రాకుండా అడ్డుకోవడంతోపాటు జిల్లా పరిధిలోని హైవేల మీద నుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి, ఇతర నిషేధిత మత్తుపదార్ధాలపై నిరంతరం నిఘా ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా 8 నిఘా బృందాలు నిరంతరం పెట్రోలింగ్‌లో విధుల్లో ఉంటాయి. వారికి సాయంగా ‘నార్కోటిక్ డాగ్స్’ను కూడా రంగంలోకి దించాం. ఇటీవల కేతేపల్లి వద్ద భారీఎత్తున గంజాయిని పట్టుకోవడంలో డాగ్స్ పాత్రే కీలకం. నార్కోటిక్ డాగ్స్ గంజాయి వాసనను దూరం నుంచే గుర్తిస్తాయి. వాటి సాయంతో హైవేలపై నిఘా పెట్టాం.
ఇలా అన్ని దశల్లోనూ డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయాలన్నదే లక్ష్యం. వివిధ శాఖల సహకారంతో వివిధ కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నాం. కలెక్టర్ నారాయణరెడ్డి సహకారంతో పలు శాఖలను భాగస్వామ్యం చేస్తూ ఈ నెల 9 నుంచి 14 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నాం. డ్రగ్స్, వాటి దుష్పపరిమాణాలపై అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తున్నాం. అవగాహన ర్యాలీలు, మానవహారాలు, వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులు, యువతను ఇందులో భాగస్వాములను చేస్తాం. అంతిమంగా నల్లగొండ జిల్లాలో డ్రగ్స్‌కు సాధ్యమైనంత వరకు అడ్డుకట్ట వేయడమే తక్షణ కర్తవ్యం’ అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు.