రామగిరి, జనవరి 20 : విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో చేరడం ద్వారా సామాజిక స్పృహ పెంపొందుతుందని, ఆ దిశగా విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు (పీఓలు) చైతన్యం చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల రవి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న యూజీ, పీజీ, ఇతర కోర్పుల కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్స్ పీఓలకు మంగళవారం వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ‘విద్యార్థుల్లో సామాజిక అవగాహన- ఆరోగ్య చైతన్యం, హెచ్ఐవీ-ఎయిడ్స్ నివారణ’ అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని, దీంతో సమాజంపై అవగాహన పెరగడంతో పాటు పలు రకాల రుగ్మతలకు తాత్కాలిక చికిత్స చేయడంతో పాటు మనోదైర్యం పెరుగుతుందన్నారు. ఇందుకు ఎన్ఎస్ఎస్ కీలక భూమిక పోషిస్తుందన్నారు.
డా.కలారి సంతోష్ కుమార్ హెర్ట్స్టాక్ గుండెనొప్పి వచ్చిన సమయంలో సత్వరం చేయాల్సిన సీపీఆర్ తో పాటు హెచ్ఐవీ- ఎయిడ్స్ నివారణ, చికిత్స అంశాలపై వివరించారు. అదే విధంగా రాష్ట్ర ఎన్ఎస్ఎస్ విభాగం డివైయుఓ జి.నర్సింహాగౌడ్ యువత- సామాజిక భాధ్యతపై అవగాహన కల్పించారు. ఏపీఏఐ నిఖత్ ఉన్నిసా ఆరోగ్యం-పరిరక్షణ అంశంపై పలు ఉదాహరణాలతో వివరించారు. ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ డా.మారం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పీఓలు అంతా బాధ్యతాయుతంగా పనిచేసి ఎన్ఎస్ఎస్ ఎంజీయూ ఖ్యాతిని కొనసాగించాలని కోరారు. యూనివర్సిటీ నిర్వహించే ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పీఓలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు విధిగా పాల్గొని వాటిని విజయవంతం చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఆర్.హరికిషన్రావు, ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ పీఓలు పాల్గొన్నారు.

Ramagiri : ఎన్ఎస్ఎస్తో సామాజిక స్పృహ : ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల రవి