గట్టుప్పల్, సెప్టెంబర్ 25 : నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం గట్టుప్పల్ తాసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆయా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అయితే ప్రస్తుతం గుర్తించిన స్థలం అణువుగా లేనందున మరో స్థలాన్ని వెంటనే గుర్తించి మ్యాప్‌తో సహా సమర్పించాలని చండూర్ ఆర్డీఓ శ్రీదేవిని ఆదేశించారు. స్థలం గుర్తింపు తర్వాత ఆయా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, తాసీల్దార్ రాములు, ఎంపీడీఓ వరలక్ష్మి పాల్గొన్నారు.