నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించనున్నట్లు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో వరంగల్‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్దఎత్తున భాగస్వామ్యం ఉండాలని, ఆ మేరకు పార్టీ నేతలంతా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ నెల 27న వరంగల్ శివారులో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వస్తున్నదని కేసీఆర్ తెలిపారు. స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు అంతా సిద్ధమవుతున్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి జిల్లా నేతలకు దిశానిర్ధేశం చేశారు.
శనివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవాల ప్రాధాన్యతను కేసీఆర్ వివరిస్తూ క్షేత్రస్థాయి వరకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ నెల 27 వరకు వరంగల్ సభ సక్సెస్ కోసం చేపట్టాల్సిన కార్యాచరణను వివరిస్తూ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సన్నాహాక సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇందులోనే మండలాలు, గ్రామాల వారీగా సభకు తరలివచ్చే జనంపైన అంచనాలు రూపొందించుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా రవాణాకు అవసరమైన వాహన ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. ఆర్టీసీ బస్సులతోపాటు స్థానికంగా అందుబాటులో ఉన్న ఇతర వాహనాలను ముందే బుక్ చేసి పెట్టుకోవాలని సూచించారు. వేసవి కావడంతో ఎండ తీవ్రత దృష్ట్యా సభకు తరలివచ్చేవారు ఇబ్బంది పడకుండా తాగునీరు, భోజనం ఏర్పాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే వారంతా మధ్యాహ్నం 3 గంటల వరకు సభా ప్రాంగణంలో ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వరంగల్‌కు దగ్గరగా ఉండే ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి 10వేల మందికి తగ్గకుండా, దూరంగా ఉన్న ఇతర నియోజకవర్గాల నుంచి 5వేలకు తగ్గకుండా జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో బహిరంగ సభకు వచ్చే ముందు రజతోత్సవ వేడుకల ఆరంభ సూచికంగా అన్ని చోట్ల పార్టీ జెండాలను ఎగురవేయాలన్నారు. వరంగల్ రజతోత్సవ సభ అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడుదామని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు, నూతన కమిటీల ఏర్పాటు, పార్టీ క్యాడర్‌కు శిక్షణ తరగతులు తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దుదామని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సర్కారు రెండూ పాలనలో విఫలమయ్యాయన్న కేసీఆర్.. ప్రజలే నిలదీసే రోజులు వచ్చాయంటూ ప్రస్తుత పరిస్థితులను వివరించారు. రానున్న కాలంలో ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగనుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు మరింత విస్తృతంగా పార్టీ తరుఫున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పథకాల వారీగా పరిస్థితులను, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పథకాల పరిస్థితిని ప్రజలకు విడమర్చి చెప్పాలని పార్టీ ముఖ్యులకు దిశానిర్ధేశం చేశారు.
రజతోత్సవ సభ నేపథ్యంలో గత నెల 22నే అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్వంలో యాదాద్రి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్ బేటీ అయిన విషయం తెలిసిందే. దాంతో శనివారం నాటి సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్‌కుమార్, తిప్పన విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.