సూర్యాపేట, మే 14 : రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న దవాఖానలపై, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటాచలం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆరోగ్యాలకు భద్రత కల్పించే బాధ్యతలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రైవేట్, ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్లలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కింద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం సమర్థవంతంగా అమలు చేసేందుకు మూడు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కోదాడ డివిజన్లో ఒక టీమ్, సూర్యాపేట డివిజన్లో రెండు టీములు తనిఖీలు చేపడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 12 ఆస్పత్రులకు నోటీసులు, 7 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. రెండు స్కానింగ్ సెంటర్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
సూర్యాపేట డివిజన్లోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ సూర్య, చిన్నారి, శ్రీ భవాని, అను, రోహిణి, రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ, సాయిరామ్, సాయిగణేశ్ మల్టీ స్పెషాలిటీ, శ్రీసాయిమారుతి, శ్రీరుద్ర, యూనిక్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటళ్లతో పాటు కోదాడ డివిజన్లో హుజూర్నగర్కు చెందిన చందన, గాంధీ, కోదాడకు చెందిన లక్ష్మీనవీన్, శ్రీ సురక్ష ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారని, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆపిల్ స్కానింగ్ సెంటర్, శరత్ కార్డియాక్ సెంటర్ను సీజ్ చేసినట్లు తెలిపారు.