పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి భరోసా ఇవ్వాల్సిన సర్కారు దవాఖానలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే స్థోమత లేక ప్రభుత్వ వైద్యం మీద నమ్మకంతో వస్తున్న రోగులకు అవస్థలు ఎదురవుతున్నాయి. నమస్తే తెలంగాణ బృందం మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రభుత్వ దవాఖాలను విజిట్ చేయగా అనేక సమస్యలు వెలుగుచూశాయి. వసతుల లేమి.. డాక్టర్ల కొరత.. అందుబాటులో లేని పరీక్షలు.. మందులు.. కొరవడిన పారిశుధ్యం.. పని చేయని వైద్య పరికరాలు.. సమయ పాలన పట్టని సిబ్బంది ఇలా అనేక సమస్యలను వివరిస్తూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖాన పేరుకే పెద్దాస్పత్రిగా మారింది. రోజు వేయి మంది వివిధ జబ్బులతో ఇక్కడికి వస్తున్నా వారికి అందుతున్న సేవలు మాత్రం అంతంతమాత్రమే. విష జ్వరాలతో వచ్చే రోగులతో ఆస్పత్రి కిక్కిరిసిపోతుండగా వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. 80 బెడ్స్ ఉన్న జనరల్ వార్డులో దాదాపు 110 మంది రోగులను ఉంచారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున ఉంచి వైద్యం చేస్తున్నారు. ఓపీ సేవలు మధ్యాహ్నం వరకే అందుతున్నాయి.
మధ్యాహ్నం తర్వాత వైద్యులు ప్రైవేటు ఆస్పత్రిలో విధులకు వెళ్తుంటే ఇక్కడికి వచ్చే రోగులకు మాత్రం వైద్య విద్యార్థులే దిక్కవుతున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్త పరీక్షల కేంద్రం టీ హబ్ ఇప్పుడు ప్రజలకు రక్షణ కవచంలా నిలుస్తున్నది. రోజూ వేలాది మంది రోగులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. జనరల్ ఆసుపత్రిలో 24 గంటల పాటు ఓపీ సేవలు అందాల్సి ఉండగా కేవలం ఒంటిగంట లోపే అందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
మధ్యాహ్నం తరువాత వచ్చే ప్రజలు ఎమర్జెన్సీ వార్డులో వైద్య సేవలు పొందాల్సి ఉంటుంది. అక్కడ కూడా వైద్య విద్యార్థులు మాత్రమే వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జనరల్ ఆసుపత్రిలో వెయ్యికి పైగా ఓపీ ఉండగా అది ఇప్పుడు 500 నుంచి 600 వచ్చింది. పది రోజులుగా సీజనల్ వ్యాధులు వస్తుండడంతో వెయ్యి వరకు ఓపీ వస్తుండగా, ఇద్దరు మాత్రమే ఓపీ చీటీలు ఇస్తుండడంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తున్నది. డాక్టర్లు రాసిన మందులు పూర్తిగా ఆసుపత్రిలోని మెడికల్ షాపులో ఉండకపోవడంతో బయట తీసుకోవాల్సి వస్తున్నది. ఆసుపత్రి ఆవరణలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది.
నల్లగొండ, నీలగిరి : నల్లగొండ జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత వేధిస్తున్నది. రోగులు బయటికి వెళ్లి మందులు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్యాస్, కడుపునొప్పి, చర్మ వ్యాధులు వంటి సమస్యలకు కూడా మందులు ఉండడం లేదు. తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన ఓపీ సేవలు పది గంటలు దాటితే గానీ ప్రారంభం అవట్లేదు. రోగులు గంటల తరబడి డాక్టర్ల కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. పలువురు డాక్టర్లు బదిలీపై వెళ్లగా వారి స్థానంలో కొత్తవారు పోవడంతో ఉన్నవారిపైనే పని ఒత్తిడి పెరుగుతున్నదని డాక్టర్లు వాపోతున్నారు. ఆరు విభాగాల్లో 77 మంది డాక్టర్లు, 42 మంది ఎస్ఆర్ ఉండాల్సిండగా కేవలం 33 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. నరాల వైద్య నిపుణులు, నెప్రాలజిస్ట్లు లేరు. ఉన్న డాక్టర్లు కూడా బయట ప్రైవేట్ క్లినిక్స్, లేదా సొంత ఆస్పత్రుల్లో పని చేసి ఆలస్యంగా రావడం వల్ల ఓపీ లేట్ అవుతుందని రోగులు చెప్తున్నారు. ఆస్పత్రిలో 650 పడకలు ఉండగా, ప్రస్తుతం ఉన్న సిబ్బంది 400 పడకలకు సరిపోను మాత్రమే ఉన్నారు.
తిరుమలగిరి(తుంగతుర్తి) : తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని 30 పడకల ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గతంలో 100 పడకల ఏరియా దవాఖానగా మార్చారు. ప్రస్తుతం అందుకు అనుగుణంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది కేటాయింపు మాత్రం జరుగలేదు. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉన్నతాధికారులు రావులపల్లి పరిధిలోని వెంపటి గ్రామంలో ఆయుష్మాన్ భవన్ మందిరంలో ఏర్పాటు చేశారు. దీని కొంద ఏడు సబ్ సెంటర్లు పని చేస్తున్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేయాల్సిన డాక్టర్లు డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు డిప్యూటేషన్‌పై సబ్ సెంటర్లలో పని చేస్తున్నారు. తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏడుగురు డాక్టర్లు ఉండాల్సి ఉండగా, ముగ్గురు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ మాత్రమే పని చేస్తున్నారు. నలుగురు డాక్టర్లు డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ దవాఖానకు నిత్యం 200 నుంచి 300 మంది రోగులు వస్తుండగా, వైద్య పరీక్షలకు ఇబ్బందిగా మారింది.
కోదాడ : కోదాడ 30 పకడల దవాఖాన అరకొర వసతులతో నడుస్తున్నది. 200 నుంచి 300 మంది వరకు ఓపీ ఉంటున్నది. 16మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సూపరింటెండెంట్‌తో కలిపి నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు జనరల్ సర్జన్లు, ఒక పిల్లల వైద్యుడితోపాటు కాంట్రాక్ట్ పద్ధతిలో గైనకాలజిస్ట్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ప్రసూతి వైద్యులు ఉండాల్సి ఉండగా, ఒక్కరే ఉండడంతో ప్రసవాల సంఖ్య పడిపోయింది. గతంలో ఇక్కడ నెలకు 50కి పైగా ప్రసవాలు జరుగగా ఇప్పుడు 20లోపు మాత్రమే జరుగుతున్నాయి. దయాలసిస్ సెంటర్‌కు మినహా మిగతా విభాగాలకు జనరేటర్ సౌకర్యం లేదు.
హుజూర్నగర్ : 100 పడకల సామర్థ్యం గల హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి జ్వరాలతో ఎక్కువమంది రాగా, వైద్యులు అందుబాటులో ఉన్నారు. దవాఖాన సిబ్బంది , మందుల కొరత లేదు. కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి వైద్యులు సమయానికి రావడం లేదు. డెంగ్యూ, చికుగున్యా వ్యాధుల నిర్ధారణకు అవసరమైన కిట్లు లేకపోవడంతో రోగులను ప్రైవేటు ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. రోగులు అధిక సంఖ్యలో వస్తుండగా, 12:30 గంటలకే ఓపీ బంద్ చేయడంతో చాలామంది వెనుదిరుగుతున్నారు. రోడ్డు ప్రమాదాల కేసులు వస్తే చికిత్స అందించకుండా జిల్లా దవాఖాకు రెఫర్ చేస్తున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.
కట్టంగూర్ : సీజనల్ వ్యాధుల కారణంగా నకిరేకల్ ప్రభుత్వాసుపత్రిలో రోజూ 300 నుంచి 400 ఓపీ నమోదవుతుండగా, ప్రస్తుతం 30 పడకలు మాత్రమే ఉన్నాయి. బెడ్స్ సరిపోకపోవడంతో గైనకాలజీ వార్డులోని 5 బెడ్స్‌ను వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30 పడకలను 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. రూ.32 కోట్లతో చేపడుతున్న పనులు 80 శాతం పూరయ్యాయి.
హాలియా పీహెచ్సీలో 24 గంటల వైద్యం అందాల్సి ఉన్నా, వైద్యుల కొరత కారణంగా అది సాధ్యమవడం లేదు. ఒక్క డాక్టరే ఉండడంతో ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం లేదు. నిత్యం వంద వరకు ఓపీ నమోదవుతున్నా 8 ఏఎన్ఎం, స్టాఫ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నైట్‌డ్యూటీ స్టాఫ్‌నర్సు లేరు. మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉంది. ఆస్పత్రిలో గ్యాస్ ట్రబుల్, షుగర్, బీపీ నొప్పుల గోలీలు అందుబాటులో లేవు.
చందంపేట(దేవరకొండ) దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం10 తర్వాత నుంచి 11 గంటల వరకు ఒక్కొక్కరుగా విధులకు హాజరయ్యారు. స్కిన్ డాక్టర్ ఆలస్యంగా రావడంతో రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆస్పత్రిలోని ఎక్స్‌రే మెషీన్ వారం నుంచి పని చేయకపోవడంతో రోగులు బయటకు వెళ్లి ఎక్స్‌రే తీయించుకుంటున్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దోమల బెడద అధికంగా ఉంది.
పీఏపల్లి పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలు అందాల్సి ఉండగా, సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో సాయంత్రం ఐదు దాటితే బంద్ పెడుతున్నారు. గతంలో ఇక్కడున్న ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సుల్లో స్టాఫ్ నర్సులు బదిలీపై వెళ్లగా, ఒక డాక్టర్ డిప్యూటేషన్ మరొక చోటకు వెళ్లారు. ప్రస్తుతం ఒక స్టాఫ్ నర్సు, ఒక డాక్టరు మాత్రం విధుల్లో ఉన్నారు.
ఇటీవల మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు చెకప్ కోసం వచ్చాను. ఆర్థో విభాగం పైఆంతస్థులో ఉంది. సరిపడా వీల్చైర్లు లేకపోవడంతో ఇబ్బంది అవుతున్నది. డయాలసిస్ కోసం వచ్చే వాళ్లదీ ఇదే పరిస్థితి.
-కోటేశ్వరమ్మ, మిర్యాలగూడ
మిర్యాలగూడలో డాక్టర్లు లేకపోవడంతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి నల్లగొండ జిల్లా దవాఖానకు వచ్చిన. ఉదయమే వచ్చి ఓపీ రాయించుకున్నా. పది గంటలైనా డాక్టర్లు రాలేదు. అడిగితే లేబర్ రూమ్‌లో మీటింగ్ అంటున్నారు. నాకు ఇది రెండో కాన్పు. ఇంటి వద్ద చిన్న పాప ఉంది. ఇబ్బంది అయితదనే పొద్దుగాల వచ్చిన. అయినా ఫలితం లేకపోయింది.
-సోనెహా, మిర్యాలగూడ
జ్వరం, విరేచనాలతో మా అమ్మ ఇబ్బంది పడుతుంటే నిన్న ఆస్పత్రికి తీసుకొచ్చా. ఒంట్లో శక్తి లేక నడువలేకపోతున్నది. పరీక్షలకు తీసుకెళ్లడానికి వీల్ చైర్ కూడా లేదు. ఓపీ వద్దకు వెళ్తే ఎమర్జెన్సీ రూమ్ దగ్గర అంటారు.. అక్కడికి వెళ్తే ఇంకో దగ్గర అంటారు. అరగంట తిరిగితే దొరికింది. దానికి కూడా ఒక కాలు లేదు.
-జాన్, శాంతినగర్, నల్లగొండ
ఆసుపత్రిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. వార్డులు, ఓపీకి సరిపడా లేరు. దాంతో సేవలు కొంత ఆలస్యం అవుతున్నాయి. ఈ విషయం కలెక్టర్, డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం. మందులపై కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. సర్జికల్ సంబంధించి అత్యవసర మందులు స్టోర్‌లో లేకపోతే ఇతర ఏజెన్సీల నుంచి కొనుగోలు చేస్తున్నాం.
-డా.రమణమూర్తి, సూపరింటెండెంట్, నల్లగొండ జిల్లా జనరల్ ఆసుపత్రి