యాదాద్రి భువనగిరి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : భువనగిరి ఇందిరమ్మ కాలనీలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. కనీసం నీటి సరఫరా కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థినులు అరిగోస పడుతున్నారు. కేజీబీవీలో సుమారు 300 మంది బాలికలు చదువుతున్నారు. గతంలో నీటి కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన అప్పటి అధికారులు ప్రభుత్వ నిధులతో బోరు వేయించారు. ఆ బోరు ద్వారా వర్షాకాలంలో తగిన నీటి సరఫరా జరిగినా ఎండాకాలంలో మాత్రం ఎండిపోయింది. దీంతో సమస్య తీవ్రమైంది.
ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు దాటినా ఇప్పటి వరకు నీటి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో విద్యార్థినుల కాలకృత్యాలు, స్నానాలు చేయడానికి నీళ్లు లేవు. నీటి వసతి లేక విద్యార్థినులు స్నానాలు చేయకుండానే తరగతులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఓ వైపు విపరీతమైన ఎండ లు, మరోవైపు నీటి కొరత ఉండటంతో విద్యార్థినులు సెలవు పెట్టి ఇంటిబాట పడుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా అడపాదడపా నీళ్లు అందిస్తున్నా అవీ సరిపోవడంలేదు. జిల్లా అధికారులు నిత్యం పర్యటిస్తున్నా సమస్య పరిష్కారం కావడంలేదని స్టూడెంట్లు, బాలల హక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.