మిర్యాలగూడ, ఫిబ్రవరి 7 : వాతావరణ మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండకాలం వానలు, వానకాలంలో ఎండలు, శీతాకాలం పరిస్థితుల్లో మార్పు లు వంటివి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఈ యాసంగిలో ముందస్తుగా పంటను సాగు మొదలుపెట్టడంతో 35 రోజులకే వరి పొట్ట దశకు చేరి అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నది. రాత్రి వేళల్లో తీవ్రమైన చలి, పగటి పూట ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాతావరణానికి తట్టుకోలేక వరి కంకుల్లో ఎదుగుదల తగ్గిపోతున్నది. దీనికితోడు తెగుళ్లు సోకడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నది.
నాలుగు నెలల పంట నెలలోపే పొట్ట దశకు..
ఏటా యాసంగి సీజన్లో నవంబర్ చివరి వా రం లేదా డిసెంబర్ మొదటి వారంలో రైతు లు నాట్లు వేసేవారు. కానీ ఈ ఏడాది సాగర్ జలాశయంలో పుష్కలంగా నీరు ఉండడంతో సా గు నీరు వస్తుందన్న ఆశతోపాటు ఆయకట్టులో త క్కువ కాలంలో పంట చేతికొచ్చే వరి విత్తనాలను సాగు చేశారు. కనీసం 90 నుంచి 100 రోజుల్లో చేతికి వచ్చే వంగడాలను వేసుకోవాలనుకున్న రైతులకు నెల రోజుల్లోపే పంట పొట్ట దశకు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అప్పుడే పొ ట్ట దశకు చేరుకోవడం, తల్లికర్ర ఎదుగదల లేకపోవడం, వరి గింజ గట్టిగ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం దిగుబడిపై తీ వ్రంగా చూపే అవకాశం ఉందని వాపోతున్నారు.
వ్యవసాయాధికారుల సూచనలు కరువు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 12.73లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అత్యధికంగా సన్నాలు వేశారు. వరి పైర్లు తెగుళ్ల బారిన పడి నష్టపోతుంటే వ్యవసాయాధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పంట సాగు సమయంలో విత్తనాల ఎంపికలో సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన వాళ్లు పట్టించుకోకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. పంట ఎదుగదల లేదని, గింజలో గట్టిదనం లేదని, తెగుళ్ల బారిన పడుతున్నదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో విఫలమయ్యారని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా యూరియాను అధిక మోతాదులో చల్లడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని రైతులపై నెపం నెట్టి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం సోకిన తెగుళ్ల విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల కంపెనీలు, డీలర్లు అందించిన విత్తనాల ప్రభావం ఉన్నట్లు రైతులు వాపోతుండగా, ముందస్తుగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా సాగు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. విత్తనం అందించిన కంపెనీల బాధ్యత అయితే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.
7 మండలాల్లో వేలాది ఎకరాల్లో ప్రభావం…
ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేటలో తెగుళ్ల ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో పెన్‌పహాడ్, నడిగూడెం, మునగాల, కోదాడ, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో, నల్లగొండ జిల్లాలోని మాడ్గులపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో నాటు వేసిన 20 రోజుల తరువాత తల్లి కర్ర ఈనడం ప్రారంభించింది. దాంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
నాటు వేసిన 25రోజుల్లోనే పొట్టకొచ్చింది
తొమ్మిదెకరాల్లో జైరామ్ చింట్లు, కావేరి చింట్లు రకాలను నారు పోసిన 25 రోజుల్లోపు నాటు పెట్టాను. పంట కాలం 120 రోజులు కాగా, నాటు వేసిన 25 రోజులకే పంట పొట్టకు వచ్చి ఈత పట్టింది. హైబ్రిడ్ వరి వంగడాలు అంటూ నాసిరకం వరి విత్తనాలను ఇవ్వడం వల్లే యాసంగి పంటకు నష్టం జరుగుతున్నది. గతంలో యాసంగి సీజన్లో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చేది. ఈసారి 20 బస్తాలు రావడం కూడా కష్టమే. 9 ఎకరాలకు ఇప్పటికే 2లక్షల రూపాయలు పెట్టుబడి అయ్యింది. ప్రభుత్వం ఈ వరి పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి.
-మద్దిరాల లక్ష్మారెడ్డి, రైతు, తోపుచర్ల
వాతావరణం ప్రభావంతోనే
జిల్లాలో పంట పొలాలు వాతావరణ ప్రభావం వల్ల కొన్ని గ్రామాల్లో నాటేసిన స్వల్పకాలంలోనే పొట్ట దశకు చేరుకున్నాయి. కొంతమంది రైతులు స్వల్పకాలిక వరి వంగడాలను నారు పోసిన 25రోజుల్లోపు నాటు వేయాల్సి ఉండగా 30 నుంచి 40 రోజుల వ్యవధిలో నాట్లు పెట్టారు. దాంతో ఇలా పొట్ట దశకు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పొలాలను పరిశీలించి దిగుబడి పెంచేందుకు సూచనలు ఇస్తున్నాం.
-శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి