కరకగూడెం, ఫిబ్రవరి 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. శనివారం రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించామని అటవీ క్షేత్రాధికారిణి తేజస్విని తెలిపారు. రెండు రోజులుగా కరకగూడెం అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నదని, ముందుగా రాయినిపేట అడవుల్లో దాడి జాడలు కనిపించాయని వెల్లడించారు.
రాయినిపేట నుంచి రాళ్లవాగు మీదుగా కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ రేగళ్ల అడవులకు వెళ్లినట్గుగా గుర్తించామని తెలిపారు. రైతులు పశువులు, మేకలను అటవీప్రాంతాలకు మేతకు తీసుకువెళ్లవద్దని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు, కరెంట్ తీగలు అమర్చితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.