ఉప్పల్, ఫిబ్రవరి 14 : మద్యం మత్తులో యువకులు వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ.. ఓ వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా వాహనంతో అతడిని రెండు వందల మీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణమైన ఘటన కుషాయిగూడ పోలిస్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన విజయ్‌కుమార్, సతీశ్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగస్తులు. 9న రాత్రి మల్లాపూర్‌లో తమ పని ముగించుకొని తమ కారులో రాంపల్లికి బయలుదేరారు.
జవహర్‌నగర్ బాలాజీనగర్‌కు చెందిన ఉప్పరి మహేశ్ ఎనగందుల తరుణ్ మద్యం తాగి వాహనంలో మల్లాపూర్ నుంచి బాలాజీనగర్‌కు వెళ్తున్నారు. మల్లాపూర్ చౌరస్తా వద్ద ముందుగా వెళ్తున్న సతీశ్‌కుమార్ కారును వీరి వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లారు. దీంతో సతీశ్ కుమార్, విజయ్‌కుమార్ వారి వాహనాన్ని వెంబడించారు. మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆ వాహనం ఆగి ఉంది. వెనకాలే వచ్చిన సతీశ్‌కుమార్ కారు దిగి ఆ యువకుల వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు.
ఆ లోపే సతీశ్‌కుమార్‌ను ఢీకొట్టుకుంటూ.. ఆ యువకులు స్పీడుగా వెళ్లారు. దీంతో సతీశ్‌కుమార్ వారి వాహనం కింద భాగంలో ఇరుకున్నాడు. ఎంత అరిచినా.. వినకుండా 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లడంతో వెంటనే స్థానికులు అడ్డుపడి వాహనాన్ని ఆపారు. గాయపడిన సతీశ్‌కుమార్‌ను ఈసీఐఎల్‌లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఇద్దరు యువకులు మహేశ్, తరుణ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.