చేనేత కార్మికులకు ఆసరాగా నిలిచే పొదుపు పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పెట్టింది. అనుబంధ కార్మికుల చెల్లింపుల వాటా కుదించింది. గతానికి భిన్నంగా అనుబంధ కార్మికుడిని ఒకరికే పరిమితం చేసింది. అంతేకాకుండా గతంలో పథకం వ్యవధి మూడు సంవత్సరాలు ఉండగా, ఈసారి రెండేండ్లకు కుదించింది. దాంతో సరారుపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ)/భూదాన్ పోచంపల్లి
నేతన్నలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా నిలిచింది. బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన కార్మికులు తిరిగి స్వగ్రామాలకు వచ్చి ఉపాధి పొందేలా చేయూతనిచ్చింది. నేతన్నల సామాజిక భద్రత కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత పొదుపు పథకానికి శ్రీకారం చుట్టారు. 2017, 2021లో విజయవంతంగా పథకం కొనసాగించారు. నేతన్నలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలిచారు. 2021-2024 సంవత్సరానికిగానూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 11వేల మంది కార్మికులు చేనేత పొదుపులో నమోదు చేసుకున్నారు. వారందరికీ సీమ్ వ్యవధి ముగిశాక ఒకో కుటుంబానికి రూ.2 లక్షల వరకు సాయం అందింది.
అనుబంధ కార్మికుడికి కోత అలా ఉండగా, ఉన్న ఒకరికి కూడా వాటా తగ్గించారు. వాస్తవానికి నేత కార్మికుల నెలవారీ ఆదాయంలో 8 శాతం ఆర్డీ-1లో జమ చేసిన తర్వాత.. ప్రభుత్వం ఆర్డీ-2లో 16శాతాన్ని నేరుగా జమ చేస్తుంది. ఆ మొత్తం నగదు వడ్డీ సహా గడువు ముగిశాక కార్మికులకు అందుతుంది. ఉదాహరణకు గతంలో కార్మికుడు రూ.1,200 వాటా చెల్లిస్తే.. అనుబంధ కార్మికుడు రూ.800 చెల్లించేది. ఇప్పుడు అనుబంధ కార్మికుడికి రూ.600కి తగ్గించారు. దీని ద్వారా ప్రభుత్వం నెలకు రూ.400 వరకు చెల్లించకుండా తప్పించుకుంటున్నది. ఇలా అనుబంధ కార్మికుడికి ఏడాదికి రూ.4,800 నష్టం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 వేల మంది వరకు అనుబంధ కార్మికులు ఉండగా, ఏటా రూ. 5కోట్ల వరకు నేతన్నలకు అందాల్సిన సాయం దక్కకుండా పోతుంది.
గతంలో పొదుపు పథకానికి మూడేండ్ల వ్యవధి ఉండేది. 36 నెలలపాటు చేనేత కార్మికులు తమ వాటా చెల్లిస్తే ప్రభుత్వం డబుల్ ఇచ్చేది. మూడేండ్ల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేవి. ఇప్పుడు రెండు సంవత్సరాలు మాత్రమే కావడంతో కార్మికులకు తకువ అమౌంట్ వస్తుంది. ప్రభుత్వానికి చెల్లింపులు తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ నెల ఒకటో తేది నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. శనివారం(నేడు) గడువు ముగియనుంది. 16 నుంచి ధ్రువీకరణ
ప్రారంభమవుతుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతేడాది ఆగస్టు 31న పథకం గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది. చేనేత కార్మికుల్లో వ్యతిరేకత రావడంతో ఇటీవల మళ్లీ పథకాన్ని ప్రారంభించింది. గతంలో ఉన్న నేతన్నకు చేయూత అనే పేరు స్థానంలో తెలంగాణ చేనేత అభయహస్త పథకం అని పేరు పెట్టింది. పేరు ఎలా ఉన్నా పథకంలో మాత్రం చాలా కోతలు పెట్టింది. గతంలో కార్మికుడితోపాటు ఇద్దరు అనుబంధ కార్మికులకు(1+2) పొదుపు పథకంలో అవకాశం కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికంగా 1+2 ఉన్నారు. గతంలోనూ అనేక మంది దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందారు. ఇప్పుడు మాత్రం ఒకరికే అవకాశం కల్పించారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ప్రస్తుతానికి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవడం లేదని, రెండో విడుతలో చాన్స్ ఉండొచ్చు అంటూ సమాధానం దాటవేస్తున్నారు. దీని ద్వారా అనుబంధ కార్మికుడు నెలకు రూ.1,600 వరకు నష్టపోనున్నారు. సంవత్సరానికి ఒకో అనుబంధ కార్మికుడికి రూ. 19వేలకుపైగా నష్టం వాటిల్లనుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మగ్గంపై చేనేత కార్మికుడితోపాటు ఇద్దరు అనుబంధ కార్మికులకు పొదుపు పధకంలో అవకాశం ఉండేది. డబ్బులు ఎకువ రావడంతో నేతన్నలకు చేయూతగా ఉండేది. ఇప్పుడు కార్మికుడితోపాటు ఒక అనుబంధ కార్మికుడికే అవకాశం ఇచ్చారు. పథకాన్ని కూడా మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించారు. పథకంలో అన్నీ షరతులే పెట్టిండ్రు.
-పెండెం విష్ణు, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి
త్రిఫ్ట్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15 వరకు అవకాశం ఉంది. కార్మికులు దరఖాస్తు చేసుకున్నాక క్షేత్రస్థాయిలో మగ్గాలను పరిశీలన చేసి ఆర్డీ అకౌంటును ప్రారంభిస్తాం. కొత్త మగ్గాలకు కూడా జియో ట్యాగింగ్ ఇస్తాం. నిరంతరం పని చేస్తూ ఉండాలి. అక్రమాలకు తావు లేకుండా నిజమైన చేనేత కార్మికుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం.
– పద్మ, రాష్ట్ర చేనేత జౌళి శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్