రామగిరి, ఏప్రిల్ 30 : బాలికపై అత్యాచారయత్నం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు.. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఉప్పుతల దుర్గాప్రసాద్ నాగార్జునసాగర్‌కు చెందిన మహిళను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ మహిళకు గతంలోనే వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సదరు మహిళ భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా దుర్గా ప్రసాద్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఇరువురు ఈ ఇద్దరు కూతుర్లను తీసుకుని బతుకుతెరువు కోసం కోళ్ల ఫారంలో పని చేయడానికి నార్కట్‌పల్లి మండలం కొండపాకొనిగూడెం వెళ్లారు. 20 ఏప్రిల్ 2018 న దుర్గాప్రసాద్ తన భార్య రెండవ కూతురు 14 ను సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో తన బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. కొండపాకొనిగూడెం గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ దగ్గర వాహనం ఆపి సదరు బాలికను చెట్లపొదల్లోకి లాక్కొనిపోయి అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు.
బాలిక గట్టిగా కేకలు వేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. జరిగిన విషయం తన తల్లికి చెప్పడంతో ఆమె తన భర్త అయిన దుర్గాప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని 21 ఏప్రిల్ 2018 న నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం దుర్గాప్రసాద్న్ దోషిగా తేల్చుతూ 7 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.2 లక్షల కంపెన్సేషన్ ప్రకటించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున సరైన సాక్షాలను ప్రవేశపెట్టి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. సమగ్రమైన దర్యాప్తు చేయడంలో ఆనాటి నార్కట్‌పల్లి ఎస్హెచ్ఓ కె.గోవర్ధన్, ప్రస్తుత ఎస్హెచ్ఓ విష్ణు కీలకపాత్ర పోషించారు. సీడీఓలు నరసింహ, కిరణ్, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన ఈ కేసు పురోగతి సాధించడానికి సహకరించారు.