రామగిరి, మే 27: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పాలిటెక్నిక్ కళాశాలలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రాష్ట్రంలో సాంకేతిక విద్య అందిస్తున్న కళాశాలల్లో విద్య, వసతులను పరిశీలించేందుకు మార్చి 24, 25, 26 తేదీల్లో ‘నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) బృదం తనిఖీలు నిర్వహించింది. వాటి ఫలితాలను శనివారం విడుదల చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 31 కళాశాలలకు ఎన్బీఏ గుర్తింపు రాగా.. అందులో ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, యాదగిరిగుట్ట కళాశాలలు ఉన్నాయి. ఎన్బీఏ గుర్తింపు వల్ల ఆయా కళాశాలలకు మన్ని నిధులు వచ్చే అవకాశం ఉంటుంది.
విద్యా ప్రమాణాలపై తనిఖీ
ఫ్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యాప్రమాణాలపై ఎన్బీఏ బృందం మార్చి 24, 25, 26 తేదీల్లో తనిఖీ చేపట్టింది. కళాశాలలో మౌలిక వసతులతో పాటు ఇతర అంశాలను జాతీయ స్థాయి బృందం క్షుణంగా పరిశీలించింది. కళాశాలల్లో అమలు చేస్తున్న కోర్సులు, ల్యాబ్స్‌ను తనిఖీ చేసింది. దాంతో పాటు అధ్యాపకుల బోధనా పద్ధతులు, వారి విద్యార్హతలు పరిశీలించిది. కళాశాలలో విద్యార్థులకు అందించే సాంకేతిక విద్య(టెక్నికల్ స్టాండర్స్), సాంకేతిక విద్యామండలి నివేదికల ప్రకారం తరగతుల నిర్వహణ, కళాశాలలో అమలు చేస్తున్న అకడమిక్ ఫలితాలు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల నిష్పత్తి వంటి అంశాలను పరిశీలించిది. వాటిపై ఉన్నత విద్యామండలికి నివేదిక అందించింది.
ఎన్బీఏ గుర్తింపుతో ప్రయోజనాలు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాలల్లో ఎన్బీఏ గుర్తింపు లభించిన కోర్సులపై మూడేళ్లపాటు సాంకేతిక విద్యామండలి ప్రత్యేక దృష్టి పెడుతుంది. భవిష్యత్‌లో కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందనున్నాయి. ప్రతి సంవత్సరం కళాశాలలో ఉన్నత స్థాయి కంపెనీలతో జాబ్‌మేళాలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పాలిటెక్నికల్ డిప్లామో కోర్సులు చదివే విద్యార్థులకు పరిశోధన ప్రాజెక్టులు, నిధులు మంజూరుకు అవకాశం ఏర్పడుతుంది. ఫ్యాకల్టీ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ అందుతుంది. దాంతో మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్య అందుతుంది.
గుర్తింపు పొందిన కళాశాలలు
ఎన్బీఏ నిర్వహించిన తనిఖీల్లో అత్యుత్తమ విద్యాప్రమాణాలు ఉన్న కోర్సులకు గుర్తింపు ఇచ్చింది. అందులో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్, ఈఈఈ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు లభించింది.
ఎన్బీఏతో విద్యార్థులకు ప్రయోజనం
నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలకు ‘ఎన్బీఏ’ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ఎన్బీఏ గుర్తింపుతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలో పరిశోధన ప్రాజెక్టులకు అవకాశం, అందుకు అవసరమైన నిధులు అందుతాయి. ఎంపికైన కోర్సుతోపాటు కళాశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక నిధులు అందిస్తారు. కళాశాలను ఇంజినీరింగ్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
– పి.జానకిదేవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నల్లగొండ
గుర్తింపు రావడం సంతోషంగా ఉంది
మా కళాశాలలోని ఇంజినీరింగ్ విభాగానికి ఎన్బీఏ గుర్తింపు దక్కడం చాల సంతోషంగా ఉంది. ఇది ప్రిన్సిపాల్, అధ్యాపకుల కృషి ఫలితమే. భవిష్యత్‌లో కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి ఇంజినీరింగ్‌లో సత్తాచాటి ఉన్నత ఉద్యోగాలు పొందేలా కృషి చేస్తాం.
– గంగారెడ్డి , సివిల్ ఇంజినీరింగ్ హెచ్ఓడీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తిరుమలగిరి