యాదాద్రి భువనగిరి, జనవరి 13 (నమస్తే తెలంగాణ)/ రామగిరి : పల్లెకు పండుగొచ్చింది. సంక్రాంతి పండుగ షురూ అయ్యింది. బతుకుదెరువు కోసం పట్నం వెళ్లిన వాళ్లంతా పండుగకు వరుస సెలవులతో ఊళ్లబాట పట్టారు. దాంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జనంతో బస్సులన్నీ నిండిపోతున్నాయి. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – వరంగల్ హైవేలు వాహనాలతో రద్దీగా మారాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరుగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో అంతటా సంక్రాంతి ముగ్గుల పోటీలు, పతంగుల ఆటలు జోరుగా నడుస్తున్నాయి.
కొత్త ఆంగ్ల సంవత్సరంలో తొలుత వచ్చే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పండుగ కావడంతో వరుసగా సెలవులు ఉంటాయి. దీంతో నగరాలు, పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా తమ సొంతూర్లకు పయనమవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు మొగ్గు చూపుతారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పండుగకు తోడు రెండో శనివారం రావడంతో మరింత కలిసొచ్చినట్లయ్యింది. ఇక జిల్లాలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు సైతం తమ ప్రాంతానికి క్యూ కట్టారు. చౌటుప్పల్, బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరిలో ఉన్న పలు కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఆంధ్రా బాట పట్టారు.
పండుగ ప్రయాణాలతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులతో బస్టాండ్లన్నీ రద్దీగా మారిపోయాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ప్రయాణం ఉండటంతో మరింత రద్దీ నెలకొంది. దీంతో బస్సులన్నీ పూర్తిగా నిండిపోతున్నాయి. కనీసం నిలబడి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూనే జనం ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా మీదుగా రెండు ప్రధాన జాతీయ రహదారులు వెళ్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – వరంగల్ హైవేలు ఉన్నాయి. ఏపీ ప్రజలకు సంక్రాంతి ముఖ్యమైన పండుగ కావడంతో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున బయల్దేరారు. బస్సులు, సొంత వాహనాలైన కార్లు, బైక్‌లపై వెళ్తున్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వరంగల్ హైవేపై బీబీనగర్ నుంచి ఆలేరు వరకు వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి, గూడూరు, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాలతో ఇబ్బందులు తప్పడం లేదు.
పండుగ రద్దీ నేపథ్యంలో అధికారులు, పోలీసులు ప్రణాళిక రూపొందించారు. హైవేలపై ట్రాఫిక్ జామ్ కాకుండా, రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అదనపు సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తున్నారు. చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. జంక్షన్ల వద్ద హైవేలకు ఇరువైపులా స్టాపర్లను ఏర్పాటు చేశారు. గూడూరు, పంతంగి టోల్ ప్లాజాల వద్ద కౌంటర్లను పెంచారు.
సంక్రాంతి అంటేనే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల ముగ్గులు, పతంగుల ఆటలు. భోగి ఆదివారం అయినప్పటికీ గ్రామాల్లో అప్పుడే పండుగ శోభ సంతరించుకున్నది. పల్లెలు, పట్టణాలు పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. మహిళలు, యువతులు ముగ్గులు వేస్తూ కనిపిస్తున్నారు. చిన్నాపెద్ద పతంగులు ఎగురవేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. మహిళల కోసం అంతటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. పండుగ నేపథ్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి.