యాదాద్రి భువనగిరి, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ఆహ్లాదం పంచే ప్రకృతి ఒడిలో చిన్నాపెద్ద ఉత్సాహంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. మూడ్రోజులపాటు ముచ్చటైన పండుగ సందర్భంగా పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఉపాధి కోసం హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లిన జనం కుటుంబాలకు కుటుంబాలుగా సొంతూళ్లకు బాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారాయి. పల్లెల్లో కార్లు పరుగులు పెట్టాయి. భోగి మంటలు, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, పంతంగుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, బసన్నల విన్యాసాలతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తున్నది. పండుగ ప్రయాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఉత్సాహంగా భోగి
రామగిరి : మకర సంక్రాంతికి ముందు రోజు సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారుజామునే మేలుకుని చుట్టుపక్కల జనమంతా ఒక్క చోటకు చేరి కాలనీలు, కూడళ్లు, ఇండ్ల ముందు భోగి మంటలు వేశారు. దాని చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోశారు. మరోవైపు మహిళలు, యువతులు ముంగిళ్లలో ఆకట్టుకునేలా ముగ్గులు వేయడంలో పోటీ పడ్డారు.
గ్రామాల కళకళ..
చాలారోజుల తర్వాత సొంతూళ్లకు వచ్చిన జనం ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుంటుకున్నారు. స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. చిన్నాపెద్దా ఆటపాటలతో సంతోషంగా గడుపుతున్నారు. సెల్ఫీలు దిగుతూ సంతోషమైన జ్ఞాపకాలను పదిల పర్చుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో అనేక గ్రామాల్లో క్రికెట్ టోర్నమెం ట్లు, వాలీబాల్, కబడ్డీ, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల మచ్చిక
తర్వలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో రాజకీ య నాయకులు అందరినీ కలు స్తూ మచ్చిక చేసుకుంటున్నా రు. ఓట్లప్పుడు అందరూ ఊరికి రా వాలని ఆశావహులు బతిమిలాడుతున్నారు. కొన్ని దావత్‌లు ఇప్పటినుంచే షురూ చేశారు.