సూర్యాపేట, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా గత ఏడు నెలల కాలంలో ప్రభుత్వానికి సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం లభించగా సామాన్యుడికి మాత్రం నడ్డి విరుగుతోంది. గతంలో ఇసుక వ్యాపారులు ఈ దందాను నడిపించగా నేడు ప్రభుత్వమే వ్యాపారం చేస్తున్నది. గతంలో జాజిరెడ్డిగూడెం రీచ్ నుంచి సూర్యాపేటకు ఒక్కో ట్రాక్టర్ రూ.3,200 నుంచి రూ.3,500లకు లభించేది. ప్రభుత్వం జిల్లాలో ఆరు రీచ్‌లను గుర్తించి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తరువాత దూరాన్ని బట్టి రూ.
రూ.4,500 నుంచి రూ.4,900 పలుకుతుండగా డ్రైవర్ బత్తాతో కలిపి దాదాపు రూ.5 వేలకు చేరుకుంటోందని పలువురు నిర్మాణ దారులు వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక సారి ఇసుకాసురులు సిండికేట్‌గా మారి ఇసుక ధరలను అమాంతం పెంచగా నిర్మాణ భారం అవుతుందని గుర్తించిన నాటి మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇసుక ధరలు పెంచితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేసి వెంటనే ధరలు తగ్గించారు.
ఇసుక… ఇది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా దొరికే ఖనిజం. మనిషి అవసరాలను ఆసరాగా తీసుకున్న కొంతమంది కక్కుర్తితో రోజురోజుకు ఇసుక ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం వరకు సూర్యాపేట పరిసర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రాగా.. నాడు ఒక్కో ట్రాక్టర్ రూ.1,500 నుంచి రూ.1,800 వరకు పలికేది. అలాంటిది నేడు ఇసుక వ్యాపారం ప్రభుత్వం చేతికి చేరి ట్రాక్టర్ ఒక్కంటికి రూ.5 వేలకు చేరుకోవడం గమనార్హం.
ఇసుక వ్యాపారులు ధరలు పెంచుతూ పోవడం ఒక ఎత్తయితే.. ఏకంగా ఆదాయం కోసం ఇసుకాసురులను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ప్రభుత్వం ఇసుక ధరలను మరింత పెంచి తన ఆదాయం పెంచుకుంటూ సామాన్యులపై భారం పెడుతోంది. జిల్లాలో జాజిరెడ్డిగూడెం, తాటిపాముల, పేరబోయినగూడెం, నందాపురం, కొత్తగూడెం, బిక్కుమళ్ల మొత్తం ఆరు రీచ్‌లను గుర్తించి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. మరో పక్క అనధికార ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టింది. ఇలా అరికట్టడం ద్వారా ఇసుక ధరలు తగ్గుతాయని అనుకుంటే ధరలు పెరగడమే కాకుండా ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే కనీసం 15 రోజుల సమయం పడుతోందని పలువురు భవన నిర్మాణదారులు వాపోతున్నారు.
జిల్లాలో ఇసుక ఆన్లైన్ విధానంలోకి వచ్చిన తరువాత ధరలు పెరిగి నిర్మాణదారులకు భారంగా మారింది. అది కూడా ఆన్లైన్లో బుక్ చేసిన తరువాత కనీసం 15 రోజులకు ఇసుక రవాణా అవుతుందని చెబుతున్నారు. వాస్తవానికి మూడేళ్ల క్రితం వరకు సూర్యాపేట పరిసర ప్రాంతాల నుంచి అనధికారికంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఒక్కంటికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు లభించగా జాజిరెడ్డిగూడెం రీచ్ నుంచి మాత్రం రూ.3,200 నుంచి రూ.3,500లకు లభించేది. నేడు అనధికార ఇసుకను పూర్తిగా కట్టడి చేసి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో అధికారిక రీచ్‌ల నుంచి సూర్యాపేటకు రూ.4,500 నుంచి రూ.4,900 పలుకుతుండగా డ్రైవర్ బత్తా వసూలు చేస్తుండడంతో రూ.5 వేల వరకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది అక్రమార్కులు ఇప్పటి కూడా లారీల ద్వారా ఇసుక బుక్ చేసి నిర్మాణం జరుగుతున్న ఇళ్ల వద్ద డంప్ చేసి డిమాండ్‌ను బట్టి ఇసుక ట్రాక్టర్‌కు రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. నేడు సామాన్యుడు 200 గజాల్లో ఒక ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే రూ.60 వేల వరకు ఇసుకకే వెచ్చించే పరిస్థితి దాపురించింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన గత ఎనమిది నెలల కాలంలో ప్రభుత్వానికి దాదాపు రూ.10 వేల కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం గణనీయంగా పెరగడం మంచి పరిణామమే అయినప్పటికీ కొంతమేర ధర తగ్గించి సామాన్యుడికి అందివ్వాలని, అలాగే బుక్ చేసిన మరుసటి రోజే ఇసుక వచ్చేలా చర్యలు చేపట్టాలని నిర్మాణదారులు కోరుతున్నారు.
ఆన్లైన్ విధానంతో అధికారిక రీచ్‌ల నుంచి ఎలాంటి దళారులు లేకుండా నేరుగా మంచి ఇసుక లభిస్తోంది. కాకపోతే రెండేళ్ల క్రితంతో పోలిస్తే ధర గణనీయంగా పెరిగింది. చిన్న ఇండ్లు నిర్మించుకునే మధ్య తరగతి వర్గాలకు ఒక్కో ఇంటికి గతంలో ఇసుక కోసం దాదాపు రూ.60 నుంచి రూ.65 వేలల్లో పూర్తయ్యేది. నేడు రూ.లక్ష నుంచి రూ.లక్ష యాభైవేలు అవుతోంది. ధరలు తగ్గిస్తే.. నిర్మాణ భారం తగ్గుతుంది.
– చంద్రారెడ్డి, భవన నిర్మాణదారుడు