రామగిరి, సెప్టెంబర్ 29: పుడమి తల్లి పూలశోభతో పులకరించింది. తీరొ క్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒకే చో ట చేర్చి ఆడి పాడగా పల్లె..పట్నం హరివిల్లులా మారింది. సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ(పెద్ద బతుకమ్మ) సంబురాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగాయి. ఆడ బిడ్డలు బతుకమ్మ పాటలతో ఆడిపాడటంతో ఊరు వాడ హోరెత్తాయి. వివిధ ఆలయాల ఆవరణల్లో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి.
రాత్రి వరకు ఆడిపాడిన మహిళలు వాయనాలు ఇచ్చి పుచ్చుకుని ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మ..మమ్ముల్ని చల్లంగా చూడమ్మా.. వచ్చే ఏడాది మళ్లీ రావమ్మ’ అంటూ బతుకమ్మకు వీడ్కోలు పలికారు. అనంతరం గ్రామల్లోని చెర్వులు, కుంటలు, కాల్వల్లో నిమజ్జనం చేశారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురం చివరి రోజైన సద్దుల బతుకమ్మతో ముగిసింది.
ఊరు నుంచి పట్టణం దాక తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి చివరి రోజు రాత్రి పొద్దుపోయే వరకు పెద్ద బతుకమ్మ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ పట్టణంలోని రామగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామిదేవస్ధానం, వీటీ కాలనీ శ్రీదేవి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు దేవరకొండలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, శివాలయంతో పాటు కొండమల్లేపల్లిలోని కన్యకా పరమేశ్వరి ఆలయం తదితర ప్రాంతాల్లో ఉత్సవాలు ఘనంగా జరిపారు.
మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్తో పాటు అన్ని నియోజక వర్గాలు, గ్రామాల్లో సంబురం అంబరాన్నంటింది. అనంతరం వివిధ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ఎస్ఎల్బీసీ కాల్వ, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి రుస్తాపురంలో, వాసాలమర్రిలో, ఆత్మకూరు(ఎం)లోనివీర్ల చెరువు వద్ద, రాజాపేట మండలంలోని జాలలో, కొలనుపాకలో, అడ్డగూడూరు మండలకేంద్రంతో పాటు ధర్మారం, లక్ష్మీదేవికాల్వ, చిర్రగూడూరు,కోటమర్తి , గట్టుసింగారం, చిన్నపడిశాల, జానకిపురం,
చౌళ్లరామారం,బొడ్డుగూడెం, డి.రేపాక, కంచనపల్లి, బీబీనగర్ పట్టణంతో పాటు మోత్కూరులో, పొడిచేడు, దత్తప్పగూడెం, పాలడుగు, అనాజిపురం, దాచారం, పాటిమట్ల, పనకబండ, సదర్శాపురం, ముశిపట్ల, రాగిబావి ్రగ్రామాల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హుషారెత్తించి, బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేశారు.