సాగుబాటలో రైతుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకం రైతుబంధు. పంటకు పెట్టుబడి పెట్టే ఈ బృహత్తర కార్యక్రమం పదో విడుతగా నేటి నుంచి ఉమ్మడి జిల్లా అమలుకానున్నది. మంగళవారం ఎకరంలోపు రైతులతో ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ఎకరంలోపు భూమి ఉన్న రెండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో వంద కోట్ల రూపాయల వరకు జమకానున్నాయి. ఈ యాసంగిలో నల్లగొండ జిల్లాలో 5.20 లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 3 లక్షల పైచిలుకు, మంది రైతులకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.61లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు వెల్లడించారు. గత యాసంగితో పోలిస్తే ఈసారి అదనంగా 1.25లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం.
నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రైతుబంధు పథకం డబ్బులు బుధవారం నుంచి రైతులకు అందనున్నాయి. మధ్యలో ఎలాంటి దళారులకు, కమీషన్ కక్కుర్తిలకు తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే ఎప్పటిలాగే డబ్బులు జమ చేసేందుకు రంగం సిద్ధ్దమైంది. ఆర్థ్దికంగా ఎన్ని ఒడిదుడులకు ఉన్నా… సాగుబాటలో రైతులను రైతు బంధు ద్వారా వెన్నుతట్టి ప్రోత్సాహించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఉమ్మడి రాష్ట్రంలో వెన్నువిరిగిన రైతును సమున్నతంగా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధ్దికి నిదర్శనమే రైతుబంధు పథకం. సీజన్ ఆరంభంలో పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా సర్కారే ఆర్థ్ధికసాయం అందిస్తున్నారు. రైతులు పూర్తి ఆత్మవిశ్వాసంతో పంటల సాగులోకి దిగుతున్నారు. సాగునీటి కల్పనతో పాటు నిరంతర విద్యుత్ పథకాలకు రైతుబంధు తోడవడంతో రాష్ట్రంలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతొంది.
ఏటేటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. సాగుకు పనికిరాని భూములు మినహాయిస్తే మిగిలిన ప్రతీ ఎకరా సాగులోకి వస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 2014లో మొత్తం సాగు విస్తీర్ణం 13 లక్షల ఎకరాలైతే నేడు అది 25లక్షల ఎకరాలకు విస్తరించింది. దాదాపు ఇది రెట్టింపు. 2018 వానకాలంలో ఎకరానికి నాలుగు వేల చొప్పున మొదలైన పథకం తర్వాత నుంచి సీజన్‌కు ఐదు వేల చొప్పున రెండు సీజన్లలోనూ అందిస్తున్నారు. సీజన్ల వారీగా కొత్తగా పాసుపుస్తకాలు పొందిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. పాసుపుస్తకాలు ఉండి… దరఖాస్తు చేసుకొని రైతులు ఉంటే వారి వివరాలు సేకరించేలా వ్యవసాయ అధికారుల వెంట పడి పెట్టుబడి సాయం అందజేస్తున్నారు. ఈ సారి కూడా కొత్తగా పాసుపుస్తకాలు పొందిన వారికి కూడా పెట్టుబడి సాయం అందించేందుకు వచ్చే నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 20వ తేదీ నాటికి పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారితో పాటు ఇప్పటికే పథకంలో ఉన్న వారు బ్యాంకు అకౌంట్లను మార్పు చేసుకోవాలనుకుంటే కూడా దరకాస్తు చేసుకోవచ్చు. దాంతో ఈ సీజన్లో రైతులకు అందించనున్న పెట్టుబడి సాయం మరింత పెరుగనుంది.
రాష్ట్రంలోనే రైతుబంధు ద్వారా అత్యధిక ప్రయోజనం పొందే జిల్లా ఉమ్మడి నల్లగొండనే. ఈ యాసంగిలోనూ అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అర్హులైన రైతుల సంఖ్య 10.81లక్షలకు చేరుకున్నట్లు అంచనా. నల్లగొండ జిల్లాలో 5.20 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 3 లక్షలు, యాదాద్రి జిల్లాలో 2.61లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరికి సుమారు 1300 కోట్ల రూపాయలు పెట్టుబడిసాయంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉంది. అయితే వీరిలో వ్యవసాయ అధికారులకు అందించే వివరాల ఆధారంగా రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి.
గత యాసంగిని పరిశీలిస్తే మొత్తం 10.06 లక్షల మంది అర్హులైన రైతు లు ఉంటే 9.56 లక్షల మంది రైతులు మాత్రమే తమ వివరాలు అందజేశారు. వీరికి మొత్తం రూ.1,232 కోట్లకు రూ.1,203.76కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. కాగా ఈ వానకాలంలోనూ మొత్తం 10.54 లక్షల మంది రైతులు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించగా అందులో తమ వివరాలను అందజేసిన మొత్తం 9.83 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించారు. ఎన్ఆర్ఐలు, కోర్టు కేసులు, ఇతర సమస్యలతో కొందరు తమ వివరాలను వ్యవసాయ శాఖకు అందజేయడం లేదని అధికారులు పేర్కొన్నారు.
రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి మొత్తం తొమ్మిది సీజన్లలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి మొత్తం 9,294.25కోట్ల రూపాయల లబ్ధి రైతులకు చేకూరింది. నల్లగొండ జిల్లాలో రూ.4,656.38 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.2,417.57కోట్లు, యాదాద్రి జిల్లాలో 2,220.30కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరిపోయాయి. ప్రస్తుత యాసంగిలో మరో 1,300 కోట్ల రూపాయలు రైతులకు చేరనున్నాయి. ఇన్ని కోట్ల రూపాయల్లోనే ఒక్క రూపాయి పక్కదారి పట్టకుండా ప్రతీ పైసా నేరుగా రైతుకే చెందేలా అత్యంత పకడ్భందీగా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వకుండా నేరుగా రైతులకే చెందుతు న్నాయంటే అందుకు ప్రభుత్వం పాటిస్తున్న పారదర్శకత, చిత్తశుద్ధ్దినే కారణం. గతంలో సమైక్య పాలనలో ఏ ప్రభుత్వ పథకంలోనైనా 20 నుంచి 30శాతం వరకు నిధులు దళారుల, అక్రమార్కుల జేబుల్లోకే చేరేవన్నది కాదనలేని సత్యం.