కట్టంగూర్, జూన్ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు భరోసా పేరుతో రైతులను ఎరవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు అన్నారు. బుధవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ రైతుల గోస పట్టింకోకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఏడాదిన్నర పాలనలో 4 దఫాల రైతు భరోసాకు ఎగనామం పెట్టి రైతులను మోసం చేసిందన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో రైతు బంధు ఇచ్చి ఓట్లు వేయించుకున్న ఘనత కాంగ్రెస్ నాయకులకే దక్కిందన్నారు. పాలన వైఫల్యాలు, ఇచ్చిన హామీలపై దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ఆడుతున్న కపట నాటకాలను ప్రజలు, రైతులు గమనిస్తున్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.