– ఆర్టీసీ స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్
– సూర్యాపేట డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన
సూర్యాపేట, జనవరి 22 : కార్మికుల హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు 2021, 2025 వేతన సవరణ చేయాలని, విద్యుత్ బస్ ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే అప్పగించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఆర్టీసీ స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట బస్ డిపోలో ఆర్టీసీ కార్మికులు డిమాండ్ డే సందర్భంగా బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్స్ ను రద్దు చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ లేబర్ పాలసీ “శ్రమ శక్తి నీతి – 2025″ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలు ఎత్తి వేసి కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు, సీసీఎస్ కు ఎన్నికలు జరపాలని కోరారు. రిటైర్ అయిన వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని, 2017 అలవెన్సులు సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే కుట్రలు మానుకోవాలన్నారు. ప్రజా రవాణా సంస్థను కాపాడాలని జరుగుతున్న పోరాటంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు భాగస్వామ్యం కావాలని కోరారు.
రోజురోజుకు తీవ్రమైన పని భారం పెరుగుతుందని, పనికి తగ్గ వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కార్మికులు నెట్టబడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. ” సంస్థ రక్షణ -కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం” కార్మికులందరూ భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ డిపో అధ్యక్ష, కార్యదర్శులు వి.లక్ష్మయ్య, డి.రవి, నాయకులు రంగు, వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, నర్సయ్య, కుమార్, అలీ భాయ్, యాకమ్మా, రాజేశ్వరి, కొమరయ్య, బేగం, స్వరూప, సువర్ణ, వాణి, కవిత, మమత, ఎలంద్ర పాల్గొన్నారు.