నల్లగొండ సిటీ, జనవరి 8 : సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నల్లగొండ రీజియన్‌లోని 7 డిపోల పరిధిలో 398 అదనపు బస్సులను నడుపనున్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈ సంక్రాంతికి ముందుగానే ప్రత్యేక బస్సులను నడుపాలని అధికారులు నిర్ణయించారు. నేటి నుంచి ఈ నెల 20 వరకు అదనపు బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జాన్‌రెడ్డి తెలిపారు.
రద్దీకి అనుగుణంగా బస్సులు
ఈ నెల 11 నుంచి విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా, ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సొంత గ్రామాలకు పండుగకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ డిపోల నుంచి రెగ్యులర్ బస్సులతోపాటు అదనపు బస్సులను నడపనున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచనున్నారు.
అదనపు బాదుడు
పండుగ సందర్భంగా ఈ నెల 10, 11న రద్దీ ఎక్కువగా ఉండనుండగా ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు భారాన్ని మోపనుంది. అదనపు బస్సులో 50 శాతం మేర చార్జీలు పెంచనుంది. ఉచిత బస్సులను తగ్గించి మరో రూపంగా ప్రయాణికులను దోచేందుకు ఆర్టీసీ సన్నద్ధమైనట్లు తెలుస్తున్నది.
రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు….
పండుగకు ఆర్టీసీ నడిపే అదనపు బస్సులో ప్రయాణికుల సౌకర్యార్థం ముఏందుగానే రిజర్వేషన్ చేసుకునేందుకు వీలు కల్పించారు. సొంత జిల్లాలకు వెళ్లి వచ్చే ప్రయాణికులు WWW. tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఆయా పరిధిలోని బస్టాండ్‌లో కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రయాణికులను సురక్షితంగా చేర్చడమే లక్ష్యం
ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో అదనపు బస్సులను ఏర్పాటు చేశాం. ఉమ్మడి జిల్లాని 7 డిపోల నుంచి తదితర ప్రాంతాలకు బస్సులు నిరంతరం ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా తమ సొంత ఊర్లకు చేరవేయడమే ఆర్టీసీ లక్ష్యం.
-జాన్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం
డిపోల వారీగా అదనపు బస్సులు
నల్లగొండ :66
మిర్యాలగూడ :70
సూర్యాపేట : 93
దేవరకొండ :57
నార్కట్‌పల్లి : 20
యాదగిరిగుట్ట :62
కోదాడ :30