యాదగిరిగుట్ట, జనవరి11: సంక్రాంతి పండుగకు ఆర్టీసీ అధికారులు అరకొర ఏర్పాట్లతో సరిపెట్టారు. దీంతో పండుగకు ఊరెళ్లాలనుకునే సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టి ఫ్రీ బస్సు పథకానికి ఆదరణ పెరిగినా అందుకు అనుగణంగా బస్సులు నడపడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విప్ ఒప్పుకున్న సంగతి విదితమే. యాదగిరిగుట్టలో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేవని, వెంటనే ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని డిమాండ్ చేసినా ఫలితం శూన్యం. దీంతో సంక్రాంతి పండుగకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కష్టమయ్యే అవకాశం కనిపిస్తోంది.
గుట్ట డిపో పరిధిలోని పలు రూట్లలో ఇప్పటికే బస్సులు పూర్తిగా నిలిపివేశారు. పలు గ్రామాల జనం తమ ఊళ్లకు బస్సు నడపాలని అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. గుట్ట డిపో పరిధిలో 104 ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో 98 బస్సులను మాత్రమే పూర్తి స్థాయిలో నడిపిస్తున్నామని, మరో 23 కొత్త ఆర్టీసీ బస్సులు, మరో 50 మంది డ్రైవర్లు అవసరం ఉందని, అందుకు ప్రతిపాదనలు పంపామని, అవి వస్తే తప్ప ఆయా రూట్లలో బస్సులు నడిపే పరిస్థితి లేదని డిపో అధికారులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గుట్ట డిపో పరిధిలో 104 ఆర్టీసీ బస్సులు ఉండేవి. ఇందులో 29 ప్రైవేట్ అద్దె బస్సులు కాగా, మిగతా 75 ఆర్టీసీ బస్సులు. వీటిని ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరితో పాటు ప్రధాన పట్టణాలకు నడిపేవారు.
అయితే గిట్టుబాటు కావడం లేదంటూ గత కొన్నేళ్లుగా 26 ప్రైవేట్ అద్దె బస్సులను నడపడం లేదు. దీంతో 29 ప్రైవేట్ అద్దె బస్సులు, 69 ఆర్టీసీ బస్సులు కలిపి గుట్ట డిపోలో కేవలం 98 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2023 కంటే మందు, కరోనా సమయంలో సైతం ఆర్టీసీ బస్సులు ప్రతి గ్రామానికి వెళ్లేవి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సులకు కొదవ లేకుండా ఉండేవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించారు. దీంతో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులనే నమ్ముకున్నారు. గుట్ట డిపోకు రోజుకు రూ. 20 లక్షల ఆదాయం రాగా అందులో మహాలక్ష్మి పథకం కింద సుమారు రూ. 14 లక్షలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్టీసీ డ్రైవర్ల కొరతతో పాటు బస్సుల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో అధికారులు చేతుతెత్తేశారు. ఓ వైపు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన జనం స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. దీంతో పాటు ఇతర గ్రామాల్లో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు సొంతూరిలో పండుగ వేడుకలు జరుపుకునేందుకు తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం ఉండటంతో మహిళలు తప్పని సరిగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లోనే జిల్లాలోని సుమారు 50 శాతం గ్రామాలకు ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.
23 బస్సులు, 50 మంది డ్రైవర్లకు ప్రతిపాదనలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువ శాతం రూట్లలో ఆర్టీసీ బస్సులు కనమరుగయ్యాయి. మారుమూల గ్రామాల్లోనే కాదు..మండల కేంద్రాల్లో కూడా ఆర్టీసీ బస్సు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న 98 ఆర్టీసీ బస్సులతో పాటు అదనంగా 23 కొత్త బస్సులు కావాలి. దీంతో పాటు బస్సు డ్రైవర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఉన్న డ్రైవర్లతో కలిపి మరో 50 మంది కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందిం చ లేదు. ఫ్రీ బస్సు పథకం పెట్టిన ప్రభుత్వం అందుకు అనుగణంగా బస్సులు ఏర్పాటు చేసి, డ్రైవర్లను నియమించాలని ప్రయాణికుల నుంచి ప్రధాన డిమాండ్ ఉంది.
ఎలక్ట్రిక్ బస్సులు లేనట్టే!
గుట్ట డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఇటీవల ప్రతిపాదించారు. గుట్ట డిపోలో తగిన సంఖ్యలో బస్సులు లేవని, ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే చేసిన డిమాండ్ దాదాపుగా అటకెక్కినట్టే. ఎమ్మెల్యే ప్రతిపాదనకు సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించ లేదని తెలుస్తోంది. దీంతో గుట్ట డిపోకు ఎలక్ట్రిక్ బస్సులే కాదు. సాధారణ బస్సులు సైతం మంజూరయ్యే అవకాశం కనిపించడం లేదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.