చివ్వెంల, మార్చి 23 : లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం వద్ద ఆదివారం జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, కూతురు ఉన్నారు. కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటయ్య పాలెంకు చెందిన గడ్డం రవీందర్(34)..
తన భార్య గడ్డం రేణుక (29), కూతురు గడ్డం రితిక(7)తో కలిసి ఆదివారం స్విఫ్ట్ కారులో ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌కు తన భార్య రేణుక మేనమామ కోతి జనార్దన్ ఇంటి వద్ద జరుగుతున్న ఉప్పలమ్మ పండుగకు వెళ్లారు. అక్కడ బంధువులతో కలిసి సంతోషంగా గడిపారు. మధ్యాహ్నం భోజనం తరువాత కారులో హైదరాబాద్‌కు తన భార్య రేణుక, కూతురు రితిక, కొడుకు రిషి కృష్ణతో బయల్దేరారు.
అలాగే కారులో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఉంటున్న రవీందర్ బావమరిది గంధం మధు, అతని కూతురు గంధం సాన్విక, గంధం గగన్ చంద్, గంధం మల్లిఖార్జున్, రవీందర్ మరదలు కడారి పుష్ప, ఇద్దరు కుమారులు కడారి జస్విన్, కడారి హర్షిత్‌ను మార్గ మధ్యలో దింపి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో చివ్వెంల బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
వీరిలో మృతుడు రవీందర్ కుమారుడు రిషికృష్ణతోపాటు మరో ఇద్దరు చిన్నారులు జస్విన్, హర్షిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీఎస్పీ రవి తెలిపారు. ప్రమా దం జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ కె. నరసింహా పరిశీలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం రిషికృష్ణతో పాటు మరో ఇద్దరు చిన్నారులు జస్విన్, హర్షిత్‌ను108వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ వైపు ఉన్న భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ రవీందర్ తల భాగం నుజ్జు అయింది.
చెప్పినప్పుడు ఆగి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదు
‘పండుగ వాతావరణం అంతా అలానే ఉంది.. ఇంటికి వచ్చిన బంధువులు ఇంకా కోటపహడ్లోనే ఉన్నారు.. పండుగకు వచ్చివెళ్తుండగా రవీందర్ కాసేపు ఉండి వెళ్లండి అని, ఎండ తగ్గిన తర్వాత వెళ్లండని అందరూ చెప్పారు.. కానీ వినలేదు.. మా మాటలు విని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు’ అని బంధు మిత్రులు సూర్యాపేట జనరల్ ఆసుపత్రి వద్ద రోదిస్తున్న తీరును అక్కడికి వచ్చిన వారిని కంట తడి పెట్టించింది.