యాదాద్రి భువనగిరి,జూలై 5 (నమస్తే తెలంగాణ) : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వీలైనన్నీ ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని నెలలుగా వరుసగా నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయి. తాజాగా 13 పనులకు రూ.33.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానా బుధవారం జీఓ నంబర్ 290 విడుదల చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీఆర్ఆర్ గ్రాంట్ కింద నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసినట్లు జీఓలు పేర్కొన్నారు. వలిగొండ మండలంలో ఐదు రోడ్లు, బీబీనగర్ మండలంలోని ఒకటి, పోచంపల్లి మండలంలో రెండు వంతెనలు, మూడు రోడ్లు, భువనగిరి మండలంలో రెండు చొప్పున రోడ్లు మంజూరయ్యాయి.
ఇప్పటికే అద్దంలా రహదారులు..
నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు గ్రామాల్లో రోడ్లు పూర్తయ్యాయి. పట్టణాలు, పల్లెలు కూడా సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఎక్కడ చూసినా రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. గ్రామాల్లో వీధుల రూపురేఖల మారిపోయాయి. ఉదాహరణకు.. భువనగిరి పట్టణంలో సమ్మద్ చౌరస్తాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతలా అంటే.. గతంలో అక్కడున్న దుర్భర పరిస్థితి చూసినోళ్లు.. ఇప్పుడు వేసినా రోడ్డును చూసి నోరెల్లబెడు తున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా కిసాన్ నగర్లో వేసిన రోడ్డు రాష్ట్ర రహదారిని తలపిస్తున్నది. గల్లీ రోడ్డులో హైవే మాదిరి డబుల్ రోడ్డు వేసి, మధ్యలో వైట్ లైన్లు వేశారు.
తీరనున్న తిప్పలు..
ఇక మండలాల్లో అక్కడక్కడ మిగిలి ఉన్న రోడ్లను సైతం నిర్మించి పూర్తి చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. గత ప్రభుత్వాలు కనీసం పట్టించుకోపోవడంతో రోడ్లు అధ్వానంగా ఉండేవి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. వర్షాకాలం వస్తే ఇక అంతే సంగతులు. ఇప్పుడు కొత్తగా రోడ్లు వేయనుండటంతో తిప్పలు తీరనున్నాయి. ఇక పోచంపల్లి మండలంలో ఇంద్రియాల, శివారెడ్డి గూడెం వద్ద మూసీపై రెండు లోలెవల్ వంతెనలు నిర్మించనున్నారు. వర్షాకాలంలో అధిక వర్షాలు కురిసినా, హైదరాబాద్‌లో మూసీ నది ఉప్పొంగినా ఇక్కడ రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడేది. కొత్తగా వంతెనలు నిర్మించనుండడంతో బాధలన్నీ తీరిపోనున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం..
భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నా. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో వందల కోట్లను తీసుకొచ్చిన. తాజాగా 13 పనులకు రూ. 33.40కోట్లు మంజూరయ్యాయి. వీటితో రోడ్లు, లోలెవల్ వంతెనలు నిర్మిస్తాం. త్వరలోనే పనులు ప్రారంభి స్తాం. ఇవి పూర్తయ్యితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. గుంతలు, కంకర తేలి ఇబ్బందులు లేకుండా రహదారులను వేస్తున్నాం. గల్లీకి గల్లీకి సీసీరోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ధ్యేయం. –పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే