మునుగోడు, సెప్టెంబర్ 30 : ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గొర్రెలు-మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని చౌటుప్పల్ రోడ్లోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాగర్ల మల్లేశ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గొర్రెలు మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. వృత్తి పనిపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురవడమే కాకుండా మన భవిష్యత్ తరాలకు అందాల్సిన విద్య, వైద్యంలో వెనకబడి పోతున్నారన్నారు.
వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారికి వృత్తిని కూడా దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. గొర్రెలు మేకల పెంపకందారులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే తమ వృత్తికి రక్షణ కల్పించాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ రెండు లక్షలతో గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. డీడీలు కట్టి పెండింగ్లో ఉన్న గొర్రెల పెంపకందారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్రీజింగ్ చేసిన పెంపకందారుల బ్యాంక్ అకౌంట్ లను వెంటనే ఫ్రీజింగ్ నుండి ఎత్తివేయాలన్నారు.
ఫారెస్ట్ భూముల్లో జీవాలను మేపకుండా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, రాష్ట్ర ఫెడరేషన్ కు నిధులు కేటాయించి తద్వారా ప్రాథమిక సొసైటీలను అభివృద్ధి చేయాలని కోరారు. కుటుంబాలపై ఆధారపడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థినీ విద్యార్థులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కురుమ, యాదవుల కుటుంబాల సమస్యలను కూడా చర్చించి భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, గొల్ల కురుమ డోలు దెబ్బ రాష్ట్ర నాయకుడు మాలిగా యాదయ్య, జిల్లా నాయకులు నెల్లికంటి రాఘవేంద్ర, ధనుంజయ్, శివర్ల సత్తయ్య, ముక్కామల యాదయ్య, నెల్లికంటి నరసింహ, మర్రి రామలింగయ్య, మెట్టు నరసింహ, కంపే నరేశ్ పాల్గొన్నారు.