సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 12 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ఎంపీ పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎవరి పాత్ర ఎంతో నిజాలను ప్రజలకు చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించిన భూమి అయినప్పటికీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అలాగే ఫార్మా భూముల రైతులకు 125 గజాల ఇంటి స్థలంతో పాటు ఉద్యోగాన్ని కేటాయించాలన్నారు. 2013 చట్టం ప్రకారం ప్రస్తుత ధర ఎంత ఉందో అంత ధరను రైతులకు చెల్లించాలన్నారు. ఈ విషయమై ప్రశ్నించిన రైతులను అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
రామోజీ ఫిలిం సిటీలో కబ్జాకు గురైన పేదల భూములను వెంటనే నిజమైన లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబట్టే ప్రయత్నాన్ని మానుకొని యూనివర్సిటీ పేరా ఆ భూమిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయమై స్పందించి అటవీ, ఫార్మా భూముల రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కంకణం కట్టుకుందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు కేంద్రం చట్టం తేవాలన్నారు.
అధికారంలోకి రాకముందు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ నేటి వరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని, లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాజ్యాంగ స్ఫూర్తిని నెలకొల్పేందుకు సీపీఎం ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. బీజేపీ కుల గణన విషయంలో రాష్ట్రంలో ఒక తీరుగా కేంద్రంలో మరోక తీరుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దేశంలో కులగణన చేయకుండా బీజేపీ అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. కులగణన లేకపోవడంతో అభివృద్ధి, రిజర్వేషన్లలో వెనుకబడి పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వెంటనే కుల గణన చేపట్టి లెక్కలు తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనువాదానికి అనుకూలంగా బీజేపీ పాలన సాగిస్తుందని, శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం సీపీఎం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.