నీలగిరి, నవంబర్ 26: రాష్ట్రంలో సుమారు రూ.60 వేల కోట్లతో వివి ధ అభివృద్ధి పనులు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్లగొండ నుంచి దర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో నిర్మించనున్న నాలుగు లేన్ల రోడ్ల నిర్మాణానికి కొత్తపల్లి వద్ద బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగర్ క్రాస్ రోడ్డు నుంచి దర్వేశిపురం వరకు చేపట్టనున్న నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులను రానున్న వారం రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. అన్ని గ్రామాలకు రోడ్లతో పాటు, మురుగు కాల్వలు నిర్మిస్తున్నామని, ఏఎమ్మార్పీ కాల్వల లైనింగ్ పనులకు రూ. 450 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు.
నల్గొండ పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, బైపాస్ రహదారి నిర్మాణం చేపట్టామని తెలిపారు. నల్గొండలో దశలవారీగా ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, నియోజకవర్గంలోని కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాల్లో మహిళల ఆధ్వర్యంలో రైసు మిల్లులు నిర్వహించేందుకు మిల్లులు కట్టించి ఇస్తామని, అలా వారికి వచ్చే లాభాన్ని మహిళా సంఘాలు పంచుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలను సందర్శించిన మంత్రి..
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి కతాల్‌గూడ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం చాంద్‌బీని అడిగి పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాలలో గదుల సమస్య, మంచినీటి సమస్య ఉందని ఆమె మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి వెంటనే పాఠశాలకు రెండు తరగతి గదులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి వెంటనే శంకుస్థాపన చేశారు. మంచినీటి సమస్యను వెంటనే పరిషరించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.