నల్లగొండ సిటీ/నల్లగొండ రూరల్, అక్టోబర్ 29 : రాష్ట్రంలో ఎక్కడా మట్టి రోడ్డు అన్నదే లేకుండా రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం సమీపంలోని సోమన్న వాగు వద్ద రూ.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు డబుల్ రోడ్లు, హైలెవల్ బ్రిడ్జి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే నల్లగొండ మండలం ముశంపల్లి పంచాయతీ పరిధిలోని ఐతవారి గూడెంలో సీసీ రోడ్డు పనులకు కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా రూ.30 వేల కోట్ల వ్యయంతో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఆర్అండ్బీ రహదారులకు రూ.600 కోట్లు మంజూరు చేశామని, శ్రీశైలం, దేవరకొండ రహదారి అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
కనగల్ జంక్షన్‌ను రూ.8 కోట్లతో విస్తరిస్తున్నామన్నారు. దర్వేశిపురం రోడ్డు వెడల్పు పనులు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని, తిప్పర్తి జంక్షన్‌ను రూ.9 కోట్లతో వెడల్పు చేసే పనులు ప్రారంభించామని తెలిపారు. రూ.38 కోట్లతో చేపట్టిన కొత్తపల్లి, పగిడిమర్రి, అనంతారం డబుల్ రోడ్డు పనులు బుధవారం ప్రారంభించి పది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పగిడిమర్రి బ్రిడ్జితోపాటు చెక్ డ్యామ్‌లు కూడా నిర్మిస్తామని తెలిపారు. వారం రోజుల నుంచి బ్రాహ్మణవెల్లెంల లిఫ్ట్ పనులు నడుస్తున్నాయని, మూడు మాసాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగం బడ్జెట్‌ను రూ.4,600 కోట్లకు పెంచి అమెరికా నుంచి ఇంజిన్ బేరింగ్ తెప్పించి రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 చొప్పున ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. నవంబర్‌లో ప్రభుత్వ వైద్యశాలతోపాటు బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎవరు ఏమి మాట్లాడినా మూసీ శుద్ధీకరణ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మిర్యాగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ మోహన్‌నాయక్, పంచాయతీ రాజ్ ఈఈ తిరుపతయ్య, ఏఈ రమేశ్, నాయకులు రామచంద్రారెడ్డి, భరతం వెంకటేశం, నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, గోళి జగాల్‌రెడ్డి. నర్సిరెడ్డి, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, బైరెడ్డి వెంకట్‌రెడ్డి, బీరం స్వాతి కరుణాకర్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, గుమ్మల మోహన్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.