చండూరు, మే 01 : పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని, దేశంలో ప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యం కోసం అంతా కలిసి పోరాడుదామని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలో అలాగే నేర్మట గ్రామంలో హమాలి వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక, కర్షక హక్కులకై నిరంతరం కృషి చేయాలన్నారు.
సీఐటీయూ, సీపీఎం నిరంతరం కార్మిక, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తుందని, భూమి, భుక్తి, విముక్తికై సాగిన తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా భవిష్యత్లో అనేక ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని ఆయన తెలిపారు. హమాలీలు, అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే ఆశ, అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, వీఓఏ మధ్యాహ్న భోజనం కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ,కర్షక వ్యతిరేక విధానాలపై రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, సీఐటీయూ సీనియర్ నాయకులు మొగుధాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, చిరంజీవి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, బిపంగి నాగరాజు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు నాంపల్లి శంకర్, బెరే భిక్షమయ్య, నగేశ్, కృష్ణయ్య, వెంకటాచారి, పుష్పలత, లక్ష్మయ్య పాల్గొన్నారు.