జిల్లాలో నాటు సారా తయారీ రోజురోజుకూ పెరుగుతున్నది. గ్రామాల్లో మళ్లీ కుటీరపరిశ్రమగా పుంజుకుంటున్నది. సారా తయారీ చేసేందుకు వినియోగించే నిషేధిత నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా విచ్చలవిడిగా దొరుకుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సారా తయారీ, విక్రయాల వృత్తిలో ఉన్న వారికి లక్షలాది రూపాయలు వెచ్చించి జీవనోపాధి కల్పించడంతో గుడుంబా ఆనవాళ్లు లేకుండా పోయాయి. దాంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మళ్లీ నాటుసారా గుప్పుమంటున్నది. సూర్యాపేట జిల్లాలో పది నెలల్లోనే నాటు సారాకు సంబంధించి ఎక్సైజ్, పోలీసు శాఖలు 1,032 కేసులు చేశాయి. అధికారులకు దొరక్కుండా సాగుతున్న దందా ఇంకా ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి తెలుస్తున్నది.
– సూర్యాపేట, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)
నాటు సారాతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రాణాలు పోతున్నాయని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారా తయారీ, విక్రయాలను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. గత ఉమ్మడి రాష్ట్రంలో నాటి రాజకీయ నేతల కనుసన్నల్లోనే గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారి చాలా మంది కోట్లకు పడిగెత్తిన వారు ఉన్నారు. ఈ నాటు సారా తాగడం వల్ల రాష్ట్రంలో ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది బక్కచికి పనులు చేయలేని దుస్థితికి రావడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీనిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాటు సారాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంది.
సారా తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలకు లక్షలాది రూపాయలు ఇచ్చి జీవనోపాధిని కల్పించింది. దాంతో జిల్లాల్లో దాదాపు 100శాతం నాటుసారాను అరికట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గతేడాది కాలంగా మళ్లీ నాటు సారా తయారీ పుంజుకుంటున్నది. ఇష్టారాజ్యంగా నల్లబెల్లం, పటిక అక్రమ రవాణా అవుతున్నది.
గత పది నెలల్లోనే నాటు సారాకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో 1,032 కేసులు నమోదయ్యాయంటే అధికారులకు దొరుకకుండా జరుగుతున్న దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పది నెలల్లోనే ఎక్సైజ్, పోలీసు శాఖలు జిల్లా వ్యాప్తంగా 4,258 లీటర్ల నాటు సారా, 1,66,292 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 15,438 క్వింటాళ్ల నల్లబెల్లం, 3540 కిలోల పటిక పట్టుకొని167 వాహనాలు సీజ్ చేశారు. మొత్తం 887మందికిపైనే కేసులు నమోదు చేయగా మరో 897 మందిని బైండోవర్ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులతోపాటు పోలీసులు బెల్లం అక్రమ రవాణాతోపాటు గ్రామాల్లో నాటుసారా తయారీపై మరింత నిఘా పెంచాల్సి ఉంది. లేని పక్షంలో సారా మళ్లీ కుటీర పరిశ్రమగా మారి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడడం ఖాయమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఎక్కడ ఎవరు నాటు సారా తయారు చేసినా, వాటికి కావాల్సిన సరుకులను రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో నాటు సారా తయారు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో నిఘా పెంచి కేసులు నమోదు చేస్తున్నాం. తీవ్రతను బట్టి, రెండో సారి ఈ దందాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేయిస్తాం. ఎక్కడైనా నాటు సారా తయారు చేస్తున్నట్లు, బెల్లం, పటిక తదితరాలను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి.
-ఆర్.లక్ష్మానాయక్, సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్