చౌటుప్పల్/ భూదాన్‌పోచంపల్లి, ఏప్రిల్ 27 : జిల్లాలో పలు చోట్ల ఆదివారం అకాల వర్షంతో ధాన్యం తడిసింది. సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో వాన పడడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వరదకు కొట్టుకుపోయింది.
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్తోపాటు భూదాన్ పోచంపల్లి మండలంలోని శివారెడ్డిగూడెంలో ధాన్యం తడవడంతో అన్నదాతలు అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా వర్షం రావడంతో ధాన్యం తడిసిందని, ధాన్యం తెచ్చి పదిరోజులైనా కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుకుంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.