– సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు
పెన్ పహాడ్, మే 12 : ప్రభుత్వ నిబంధనలు దిక్కరించే రైస్ మిల్లర్స్ యాజమాన్యం, ఇండ్ల గణన చేసే ఏన్యూమరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ హెచ్చరించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలోని న్యూ బంజారాహిల్స్ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి రైస్ మిల్, సువర్ణ జ్యోతి రైస్ మిల్, మాచారం గ్రామ పంచాయతీలో గల వెంకటసాయి రైస్ మిల్, అనంతారం గ్రామ పంచాయతీలోని మహాదేవ్ హైటెక్ రైస్ మిల్ను తాసీల్దార్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆకస్మిక ఆర్డీఓ తనిఖీ నిర్వహించారు. ఐకేపి, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్స్ వద్ద 30 నుండి 40 లారీలు (ధాన్యం బస్తాలు) దిగుమతి చేయకుండా లారీలను ఆపుకోవడంతో మిల్లర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరత్వరగా ధాన్యం లోడులు దిగుమతి చేసి లారీలను ఆపుకోకుండా వెంటనే పంపివేయాలని మిల్లర్స్ కు సూచించారు.
గ్రామాల్లో కొనసాగుతున్న ఇండ్ల జన గణన 2027 సర్వే ప్రక్రియను బంజారాహిల్స్ తండా. దూపాడు గ్రామంలో పరిశీలించారు. ఏన్యూమరేటర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ధిక్కరించే ఏన్యూమారేటర్లు, రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైస్ మిల్ వద్ద జీపీఓలను పెట్టి లారీల ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేయిస్తామని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ గుమ్మా రాజశేఖర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అజీజ్ నిషా, రంజిత్ రెడ్డి, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు ఏన్యుమారేటర్లు పాల్గొన్నారు.