నల్లగొండ రూరల్, మార్చి 9 : కేసీఆర్ సర్కార్ పాలనలో పదేండ్లుగా మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు నిండుకుండలా ఉండడంతో పంటలకు పుష్కలంగా నీరు అందేది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ ఏడాది చెరువులు ఒట్టిపోవడంతోపాటు బోర్లు అడుగంటిపోయాయి. జల వనరులు అడుగంటి.. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతుండడంతో పంటలు ఎండిపోతున్నాయి.
నల్లగొండ నియోజకవర్గంలో యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు పొట్ట దశలో నిలువునా ఎండిపోతుండడంతో అన్నదాతలు కంటతడి పెడుతున్నారు. ఏఎమ్మార్పీ కింద ఉన్న డీ-40 ఎల్-11 ద్వారా చుక్క నీరు రాకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో మామిడాలలో మెజార్టీ పొలాలు ఎండుతున్నాయి. దాంతో వేలకు వేలు పెట్టుబడి పెట్టి నాట్లు వేసిన అన్నదాతలు బోరుమంటున్నారు. ఏటా వేల ఎకరాల్లో వరి, నిమ్మ, బత్తాయి ఇతర పంటలు పండించే అప్పాజీపేటలో ఈ యాసంగిలో సాగు ప్రశ్నార్థకంగా మారింది. పొట్ట దశలో ఎండుతున్న పొలాలకు చివరి ప్రయత్నంగా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది.
ఎండుతున్న మామిడాల
తిప్పర్తి : ఏఎమ్మార్పీ కింద ఉన్న డీ-40 ఎల్ 11 ద్వారా చుక్క నీరు రాకపోవంతోపాటు భూగర్భ జలాలు అడుగంటడంతో తిప్పర్తి మండలంలోని మామిడాల ఎండతుంది. బోర్లు పోయకపోవడంతో మెజార్టీ పొలాలు ఎండుతున్నాయి. దాంతో వేలకు వేలు పెట్టుబడి పెట్టిన అన్నదాతలు బోరుమంటున్నారు. పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచక రైతులు ఆగమాగం అవుతున్నారు.
చేసేదేమీలేక పంట పొలాలను గొర్లు, బర్లకు మేతకు ఇస్తున్నారు. డీ-40 సబ్ కాల్వల ద్వారా కొంత మేర నీటి సరఫరాకు అవకాశం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఆడపాదడపా వస్తున్నాయని, కాల్వ నీళ్లు వస్తే కొంత మేర బోర్లు పెరిగి పంటలు దక్కేవని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు సర్వే చేసి ఎండిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, పంట సమయానికి ఆర్థికంగా సహాయం అందేదని రైతులు చెప్తున్నారు.
అప్పాజీపేటలో ఎండుతున్న పంట చేలు
నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో సాగు విస్తీర్ణం మూడు వేల ఎకరాలు ఉండగా.. అందులో 1300కు పైగా ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే.. బ్రాహ్మణ వెల్లెంల నుంచి డిస్ట్రిబ్యూటరీల ద్వారా అప్పాజీపేట చెరువు నింపాల్సి ఉన్నా ఔరవాణిలో భూములు నష్టపోతున్న రైతులకు పరిహారం ఇవ్వకపోవడతో వారు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని కాకి చెరువుతోపాటు మరో చెరువు నీళ్లులేక అడుగంటిపోయాయి. దాంతో 15రోజుల క్రితం నిండుగా పోసిన బోర్లు ఆగిఆగి పోస్తున్నాయి.
ఇదే సమయంలో లోవోల్టేజీ విద్యుత్ సమస్యతో మోటార్లు కాలిపోయాయి. ఫలితంగా ఇప్పటికే సుమారు వంద నుంచి 150ఎకరాలకు పైగా వరి పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. మరో వంద ఎకరాలకు పది రోజులు నీరు అందిస్తే పంట చెతికొచ్చే ఆవకాశం ఉంది. లేదంటే అవి కూడా ఎండిపోనున్నాయి. ఎండిన పొలాలను రైతులు పశువుల మేతకు వదిలేశారు. కొందరు రైతులు పంటలను కాపాడుకునేందకు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు అందిస్తుండగా, మరి కొందరు కొత్తగా బోర్లు వేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి అయినా దక్కుతుంతో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బ్రాహ్మణవెల్లెంల డిస్ట్రిబ్యూటరీల ద్వారా చెరువును నింపి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కోతకు ముందే గొర్రెల మేతకు
మోటకొండూర్లో నీళ్లు లేక ఎండిన వరిపొలాలు
మోటకొండూర్ : ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే సరిపడా నీరులేకపోవడంతో వరిపంట మొత్తం ఎండిపోయింది. రైతులు చేసేదేమిలేక వరి పొలాన్ని గొర్రెల మేతకు వదిలారు. మోటకొండూర్ మండలం చాడ మధిర గ్రామ పంచాయతీ బెజ్జంకి బావికి చెందిన సలేంద్ర సోములు, బెజ్జంకి రాంరెడ్డితో పాటు మరో రైతు కలిసి 12 ఎకరాల భూమిని మోటకొండూర్ మండల కేంద్ర పరిధిలో కౌలుకు తీసుకుకున్నారు. ఎకరాకు రూ.25వేలు ఖర్చు చేసి వరిపంట వేశారు. వరినాటు కోసం డబ్బులు అప్పుగా తెచ్చి సాగుచేస్తే భూగర్భజలాలు అడుగంటడంతో పంట మొత్తం ఎండి పోయింది. చేసేదేమీ లేక వరిపైరును గొర్రెల మేతకు వదిలేశారు. తెచ్చిన అప్పు మీదపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
30 వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పెట్టా
నాకున్న రెండెకరాల 11 గుంటల వ్యవసాయ భూమిలో వరి వేసిన. ఇప్పుడు రెండు బోర్ల నుంచి చుక్క నీళ్లు వస్తలే. ఇప్పటికే ఎకరం పొలం పూర్తిగా ఎండిపోయింది. మిగతాది చేతికి వచ్చేందుకు 20 రోజులు పడుతది. ఈ పంటను కాపాడుకునేందుకు ఇప్పటి వరకు 30 వాటర్ ట్యాంకర్ల నీళ్లు అందించా. సమీపంలో ట్యాంకర్ నీళ్లు అందించే వసతి కూడా లేదు. మా అన్నల పొలం కూడా పూర్తిగా ఎండిపోయింది. బర్లు, గొడ్లను మేపుతున్నాం. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– ఓరుగంటి వెంకన్న, రైతు, అప్పాజిపేట, నల్లగొండ మండలం
పొలం ఎండడంతో బర్రెను మేపుతున్నా
నాకు 5ఎకరాల పొలం ఉంది. మూడు బోర్లు ఉన్నాయి. పొలం ఈతపట్టింది. ఇప్పుడు బోర్లు సరిగా పోయకపోవడంతో మొత్తం ఎండింది. కాల్వ నీళ్లను కూడా రానిస్తలేరు. కాల్వ వస్తే కొంత ఎండిపోకుండా ఉండేది. చేసేదేమీలేక బర్రెను మేపుతున్నా. అధికారులు పట్టించుకొని కాల్వ వచ్చేటట్టు చేయాలి.
– అంజయ్య, రైతు, మామిడాల, తిప్పర్తి మండలం
నాలుగెకరాల పొలం ఎండిపోయింది
నా భర్త లేకున్నా నా ఇద్దరు కుమారులతో కలిసి నాలుగెకరాల పొలం పెట్టాను. 6బోర్లు వేస్తే ఒక్కటి మాత్రమే పోస్తుండేది. అది కూడా కొన్ని రోజుల నుంచి చిన్నచిన్నగా తగ్గి మొత్తం పోయింది. దాంతో పొలం మొత్తం ఎండిపోయింది. అప్పుజేసి రూ.50వేల దాకా పెట్టుబడి పెట్టాను. కొసకు అది ఎండిపోయింది. చేసేది లేక గొర్రెలకు మేతకు ఇచ్చాను. పొలం ఎండిపోవడంతో నా పెద్ద కుమారుడు మిర్యాలగూడకు పనికిపోతుండు. ఇంతకుముందు మంచిగుండేది. రైతుబంధు వచ్చేది. ఇప్పుడు ఏ బంధూ లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
– కోడదల కళమ్మ, మామిడాల, తిప్పర్తి మండలం