సూర్యాపేట, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎత్తారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అర్వపల్లి మండల కేంద్రంలోని శనివారం శ్రీరామ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాగా, తెల్లవారుజామున నాలుగు గంటలకే అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు నియోజకవర్గవ్యాప్తంగా ముందస్తు అరెస్టు చేసి నూతనకల్ స్టేషన్‌కు తరలించారు.
దాంతో కాంగ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అధికార పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం పట్ల నియోజకర్గంలో తమను చూసే గాక ఎమ్మెల్యే తీరు కూడా నవ్వుల పాలయ్యేలా ఉందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు, ధర్నాలు, నిరసనలు చేపడితే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టు చేయడం చూశాం గానీ.. స్థానిక ఎన్నికల కోసం చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే సొంత పార్టీ నేతలను అరెస్టు చేయించిన ఘనత మా ఎమ్మెల్యేకే దక్కిందంటూ యోగానందచార్యులు అసహనం వ్యక్తం చేశారు.
సామేల్‌ను తాము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీ కేడర్‌ను కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేసుకుంటే అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఇండ్లపై పడి దొంగలను పట్టుకొచ్చినట్లు పట్టుకొచ్చి నూతనకల్ పోలీస్ స్టేషన్లో నాలుగు గంటల పాటు నిర్బందించడం మీద రాష్ట్ర నాయకత్వం స్పందించాలన్నారు. దీనిపై గాంధీభవన్ మెట్లు ఎక్కుతామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేపై వరుసగా రుసరుసలు
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్‌పై నియోజకవర్గ కాంగ్రెస్‌లో వరుసగా అసమ్మతి చెలరేగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో తట్టెడు ఇసుకను కూడా ఎత్తనివ్వనని ఊరూరా తిరిగి ప్రచారం చేసిన ఆయన ఎమ్మెల్యే అయిన తరువాత లారీల కొద్దీ ఇసుక అక్రమంగా తరలుతున్నా కనీసం పట్టించుకోకపోవడం లేదని ఆ పార్టీ నేతలు బహిరంగా విమర్శించారు. మరోవైపు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తన కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించడం గమనార్హం. తాజాగా గురువారం శాలిగౌరారం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే చెప్పడంతోనే పోలీసులు తనను కొట్టారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనంగా మారింది. ఆ మరుసటి రోజే సొంత పార్టీ నాయకుల ముందస్తు అరెస్టులతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు అయ్యింది.