మునుగోడు, జూన్ 04 : మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మార్నింగ్ వాక్ చేసుకుంటూ పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే మండలంలోని పులిపలుపుల గ్రామం చేరుకుని వీధులన్ని కలియ తిరుగుతూ పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్ట్ నుండి పులిపలుపుల చెరువుకు నీరు అందించడానికి తన సొంత ఖర్చులతో తవ్వించిన కాల్వను పరిశీలించి పెద్ద చెరువులో ఎంత మేరకు నీరు చేరుకుందో పరిశీలించారు. చెరువు కట్ట పటిష్టంగా ఉందా, లేదా అనే విషయాలతో పాటు చెరువు అలుగును గ్రామస్థులతో కలిసి వీక్షించారు.
పులిపలుపుల నుండి బీరెల్లిగూడం గ్రామం వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించి, రోడ్డుకు చుట్టు పక్కల ఉన్న రైతులతో మాట్లాడారు. రోడ్డును ప్రమాదకర మూల మలుపులు లేకుండా సక్కగా ఉండేలా చూడాలని కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం ఉకోండి గ్రామానికి చేరుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండ మురళి, మర్రి మత్స్యగిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, మండల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.