– మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట, జూలై 11 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకో, తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లిస్తున్నావ్ వచ్చే ఎన్నికల్లో 117 కాదు కదా ఉత్త 17 సీట్లు కూడా గెలవలేవని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడంపై శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడుగుల ఘాటుగా స్పందించారు. ఏదైనా సభ జరిగితే మీరు చేసింది, చేయాల్సింది, ఇచ్చిన హామీలు అమలు చేసినవి, అమలు చేయాల్సినవి చెప్పాలే తప్ప.. సీఎం స్థాయిని మరచి బజారు వ్యక్తిగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. అసలు కానే కానీ డీలిమిటేషన్లో 185 స్థానాలు అవుతాయంటూ అందులో తామే 119 గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నీ దొంగ తెలివితేటలు ప్రజలకు అర్థమయ్యాయని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నువ్వు పడుతున్న ఫ్రస్ట్రేషన్ ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కేసీఆర్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కన్నెపల్లి పంప్ హౌస్‌ను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రాకు 100 టీఎంసీల నీళ్లు మళ్లించినట్లు తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి రెండు మూడు టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసి గందమల్ల వరకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కేసీఆర్ కు పేరు వస్తుందనే మొండి వైఖరితో కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయడం లేదన్నారు. మేడిగడ్డకు నీళ్లు వస్తే రామాలయంతో పాటు లక్ష ఎకరాలు మునిగిపోతుందని చెప్పడం తగదన్నారు. ఇప్పటికే ఆంధ్రా వాళ్ళు 27 క్యూసెక్కుల నీరు పోలవరానికి మళ్లించి దాని ద్వారా ప్రకాశం బ్యారజీ నింపి కాలువల్లో నీళ్లు తీసుకుపోతుంటే కండ్లు మూసుకున్నావని అన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ పేరుతో నువ్వు, నీ మంత్రులు భూముల దోపకం చేస్తూ సంపాదించి రాహుల్ గాంధీకి పంపుడు తప్ప ప్రజల కోసం చేసింది ఏమి లేదన్నారు. ఇక్కడ నీకే దిక్కులేదు అక్కడ రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. పరిపాలన చేతకాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవుళ్ల మీద ఒట్టు వేయడం పరిపాటిగా మారిందన్నారు. ఆయన ఒట్టు వేయని దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించారు. వ్యక్తులను విమర్శించడం రాజకీయం కాదని, ఆంధ్రాలో రెండు, మూడు పంటలకు నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణలో రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వకుండా ఎండబెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా అమలు చేయని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కన్నెపలి పంపు హౌస్ ను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినప్పటికీ నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు అన్ని వర్గాల వారికి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేని అసమర్ధుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ నాయకులు బండారు రాజా, శివ పాల్గొన్నారు.