Gadari Kishore kumar | మోత్కూరు, సెప్టెంబర్ 02 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ఆయన తెలంగాణ చరిత్రలో అసమర్ధ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు తన స్థాయిని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్డీవో కార్యాలయం, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి ప్రధాన కూడలి వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర సాగింది.
ఈ సందర్భంగా కిశోర్‌కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని, వాటిలో ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఒక జీఎం మేస్త్రీ, కింద ఒక బీఎం మేస్త్రీ పాలన సాగిస్తున్నట్లుగా పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన పదేళ్ల ఎమ్మెల్యే పదవీకాలంలో రూ.10 లక్షల ఇసుక మాఫియాకు పాల్పడినట్లు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సాగర్ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోరు మెదపడం లేదని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం..
చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కారణంగానే సాగర్ నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ రైతులను ఎండబెట్టి ఆంధ్ర రైతులకు మేలు చేస్తున్నారని విమర్శించారు. వెయ్యి రోజుల పాలనపై మాట్లాడే ప్రతి సభలోనూ రేవంత్‌రెడ్డి కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారని కిశోర్‌కుమార్ అన్నారు. అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాల మాదిరిగా ‘కేసీఆర్ మాల’ వేసుకుని తిరగాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడంపై కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
నిరసనలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రస్తావిస్తూ 420 మీటర్ల ఫ్లెక్సీని ప్రదర్శించారు. కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Jailer 2 | జైలర్ 2’ రిలీజ్‌పై క్లారిటీ.. ఆ డేట్‌కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!
ప్రజా వ్యతిరేక పాలనపై భగ్గుమన్న బీఆర్ఎస్ మిర్యాలగూడ శ్రేణులు
ఢిల్లీ వాళ్ల కాళ్ల ముందు తెలంగాణ ఆత్మ గౌరవం : మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్