లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో వెస్ట్రన్ కమాండ్ అధిపతిగా వ్యవహరించిన ఆయన ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. (Jeetendra Mishra) కొత్తగా ఏర్పాటు చేయనున్న సీఈవో పోస్ట్‌కు ఐదు వేలకుపైగా దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను తొలి సీఈవోగా ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.
కాగా, ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) జితేంద్ర మిశ్రా 1986 డిసెంబర్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో ఫైటర్ పైలట్‌గా చేరారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్, అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ పూర్వ విద్యార్థి. 2025 జనవరిలో ఐఏఎఫ్‌లో అత్యంత ముఖ్యమైన ఆపరేషనల్ కమాండ్లలో ఒకటైన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ బాధ్యతలు స్వీకరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ కమాండ్‌కు ఆయన నేతృత్వం వహించారు. 38 ఏళ్లకు పైగా సేవలు అందించిన తర్వాత ఏప్రిల్ నెలలో వైమానిక దళం నుంచి పదవీ విరమణ చేశారు.
మరోవైపు విరాళాల చోరీ వివాదంతో దెబ్బతిన్న అయోధ్య ఆలయ నిర్వహణ, ఆర్థిక జవాబుదారీతనాన్ని పటిష్టం చేయాల్సిన కీలక బాధ్యత ఇప్పుడు ట్రస్ట్ తొలి సీఈవోగా నియమితులైన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాపై ఉన్నది. విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా రాజీనామా చేశారు. విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.