నల్లగొండ, జూలై 16 : సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికి వదిలి, విమర్శలతోనే కాలం వెల్లదీస్తున్నడని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి 19 నెలలైనా చేసింది శూన్యం అన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబంపై విమర్శలతోనే కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం నల్లగొండకు వస్తే ఏం ఇచ్చి పోతాడో, ఎంత అభివృద్ధి చేస్తాడో అని ప్రజలు ఎదురుచూస్తే, పనికిమాలిన మాటలతో సీఎం స్థానాన్ని దిగజార్చుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సభలో తిట్ల పురాణం ఎత్తుకున్నట్లు తెలిపారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిందని, మీరు ఐదు లక్షలకే ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ పేరుతో రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెరలేపాడని ఆయన విమర్శించారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం తుంగతుర్తిలో రేషన్ కార్డులు ఇవ్వడానికి సభ పెట్టాడా ? లేదంటే జగదీశ్ రెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి సభ పెట్టాడా అనే విషయాన్ని తెలపాలన్నారు. జగదీశ్ రెడ్డిని మూడు నాలుగు ఫీట్లు అనడం కాదు ఆయన చేసిన అభివృద్ధి ఎంతో, మీ నాయకులు ఆరు ఫీట్లు ఉండి చేసిన అభివృద్ధి ఎంతో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వకుండా రైతుల కడుపులు మాడ్చి గోదావరి నీళ్లు మొత్తం సముద్రంలోకి వదులుతున్నరని దుయ్యబట్టారు. 2014 ముందు రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తే, 2014 తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది నిజం కాదా? అది చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్తుంటే, ఇంకా ఎడమ కాల్వకు, ఏఎంఆర్పీకి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి జవాబు చెప్పాలన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు పద్ధతిగా మాట్లాడాలే తప్పా పద్ధతి తప్పి మాట్లాడి ప్రజల ముందు పరువు తీసుకోవద్దని హితవు పలికారు. కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించి సీతారామ ప్రాజెక్ట్‌కు నీళ్లు ఇస్తే వాటిని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. కానీ నల్లగొండలో మాత్రం ఎడమ కాల్వకు నీళ్లు ఇవ్వాలనే సోయి ఇక్కడి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎందుకు లేదని ప్రశ్నించారు. జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్దాలు పదేపదే చెప్పి వాటిని నిజాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు చూస్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ 19 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. వెంటనే గ్రామాల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు, శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాసరెడ్డి, ఐతగోని యాదయ్య, బొమ్మరబోయిన నాగార్జున, నారబోయిన భిక్షం పాల్గొన్నారు.