సూర్యాపేట, జూన్ 29 : 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి చావు అంచులకు వెళ్లి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని తులసివనంగా చేస్తే అందులో పెరిగిన గంజాయి మొక్క రేవంత్ రెడ్డి అని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్‌రెడ్డిపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంద్ర పాలకులకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశాడని, ఫ్లోరైడ్ ను పారద్రోలడంతో పాటు తెలంగాణలో ఉండనే ఉండదన్న కరెంటు పోనే పోదన్న విధంగా చేసి 24 గంటలు ఉచిత విద్యుత్ అందించి అమావాస్య చీకట్లను పారద్రోలాడన్నారు.
ఎత్తు పొడుగు ఉన్న మీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారం చేపట్టిన 30 నెలల్లో ఏం పనులు చేశారో చెప్పాలన్నారు. ఒక్క మంత్రి ఒక్కనాడు అధికారులతో సమీక్షలు పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని విమర్శించారు. రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రేవంత్‌కు, ఆయన మంత్రులకు తెలవడంతో అందిన కాడికి దోచుకుంటున్నట్లు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల పాలన, దోపిడి పాలన ప్రజలకు అర్థమైందని అందుకే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ అగ్రనేతలపై నోరు పారేసుకుంటే ప్రజల చేతుల్లో చావు దెబ్బ తప్పదని ఆయన హెచ్చరించారు.